Hanuman Cross the Ocean: సీతమ్మను వెతుకుతూ హనుమంతుడు లంకకు వెళ్లిన ఘట్టం రామాయణంలో అత్యంత ఆసక్తికరమైన భాగాల్లో ఒకటి. సీత లంకలో ఉందని జటాయువు సోదరుడు సంపాతి ద్వారా తెలుసుకున్న తర్వాత.. ఆమెను వెతికి వెళ్లాల్సిన బాధ్యత హనుమంతుడిపై పడుతుంది.

కానీ లంకకు వెళ్లాలంటే మధ్యలో భారీ సముద్రాన్ని దాటాలి. ఎంత దూరం దూకగలనో హనుమంతుడికే అప్పటివరకు పూర్తిగా గుర్తులేదు. చిన్నతనంలో తనకు ఉన్న శక్తి, సామర్థ్యాల గురించి కూడా ఆయన మర్చిపోయి ఉన్నాడు.

అప్పుడు జాంబవంతుడు హనుమంతుడికి అతని అసలు శక్తిని గుర్తు చేశాడు. “నీకు సాధ్యం కానిది ఏదీ లేదు” అన్నట్లుగా అతనిలో ధైర్యాన్ని నింపాడు. దీంతో హనుమంతుడికి తన శక్తి గుర్తొచ్చింది. వెంటనే భారీ రూపం దాల్చి సముద్రాన్ని దాటేందుకు సిద్ధమయ్యాడు.

లంకకు వెళ్లే మార్గంలో హనుమంతుడికి ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. మైనాకుడు విశ్రాంతి తీసుకోమని కోరాడు. సురస హనుమంతుడి తెలివితేటలను పరీక్షించింది. సింహిక అతని నీడను పట్టుకుని అడ్డుకునే ప్రయత్నం చేసింది. కానీ హనుమంతుడు ఒక్కో సమస్యను తన బలం, తెలివితో ఎదుర్కొని ముందుకు సాగాడు.

చివరకు లంకకు చేరుకున్న హనుమంతుడు సీతమ్మను వెతికి కనిపెట్టాడు. రావణుడి అశోకవనంలో ఉన్న సీతకు రాముడి ఉంగరాన్ని చూపించి తాను రాముడి దూతనని చెప్పాడు. ఒకవైపు అపారమైన బలం.. మరోవైపు సమయానికి తగ్గట్టు తెలివిగా ఆలోచించే శక్తి.. ఈ రెండింటి కలయికే హనుమంతుడిని రామాయణంలో ప్రత్యేకమైన పాత్రగా నిలబెట్టింది.

Next Story