Traditional Rules Mentioned in Scriptures: శుభకార్యాలు, పూజల సమయంలో భార్యాభర్తలు ఎలా కూర్చోవాలి? శాస్త్రాలు చెబుతున్న నియమాలు ఇవే..
శాస్త్రాలు చెబుతున్న నియమాలు ఇవే..

Traditional Rules Mentioned in Scriptures: భారతీయ సంస్కృతిలో వివాహ బంధానికి, దంపతుల స్థానానికి అత్యంత పవిత్రమైన ప్రాముఖ్యత ఉంది. భార్యాభర్తలు అంటే ఇద్దరు వ్యక్తులు కాదు.. ఒకే శరీరంలోని రెండు భాగాల వంటివారని మన సనాతన ధర్మం చెబుతోంది. ఈ లోతైన నమ్మకాన్ని ఋణానుబంధ, రూపేణ, పశుపత్ని, సుతాలయః, వంటి శాస్త్రోక్త భావనలతో పాటు అర్ధాంగి, అర్ధనారీశ్వర తత్వాలు మనకు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఇంట్లో లేదా దేవాలయాలలో ఏ శుభకార్యమైనా, పూజలైనా చేసినప్పుడు వాటి సంపూర్ణ ఫలితం దక్కాలంటే.. దంపతులు కూర్చునే ఆసన పద్ధతి చాలా ముఖ్యమని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.
శాస్త్రాల ప్రకారం దంపతులు ఏయే సమయాల్లో ఎటువైపు కూర్చోవాలో వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక విశేషాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
భార్య భర్తకు కుడి వైపున ఎప్పుడు కూర్చోవాలి?
ధార్మిక కర్మలు, సృష్టి కారకమైన పవిత్ర కార్యాలు చేసేటప్పుడు భార్య ఎల్లప్పుడూ తన భర్తకు కుడి వైపున కూర్చోవాలని శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి. ఈ క్రింది సందర్భాలలో ఈ నియమాన్ని తప్పక పాటించాలి:
పూజలు - దైవదర్శనం:
ఇంట్లో నిత్య పూజలు చేసేటప్పుడు, దేవాలయాలలో భగవంతుని దర్శనం చేసుకునేటప్పుడు భార్య కుడి వైపున ఉండాలి.
యజ్ఞ యాగాలు:
హోమ-హవనాలు, యజ్ఞ-యాగాది క్రతువులు, నాంది, సోమయాగం వంటి పెద్ద కార్యక్రమాలలో ఈ ఆసన పద్ధతి తప్పనిసరి.
ముఖ్య వేడుకలు:
వివాహ వేడుకలు, కన్యాదానం చేసే సమయం, ఉపనయనం, నూతన గృహ ప్రవేశం చేసేటప్పుడు భార్య భర్తకు కుడి వైపున నిలబడాలి లేదా కూర్చోవాలి.
జ్యోతిష్యం:
జ్యోతిష్యునికి లేదా సిద్ధాంతికి తమ జాతకాలను చూపించి సలహాలు తీసుకునేటప్పుడు కూడా ఇదే నియమం వర్తిస్తుంది.
ముఖ్య గమనిక: పూజలు లేదా వ్రతాలు చేసే సమయంలో దంపతులు అనవసరమైన మాటలు మాట్లాడటం ఆపి, సంపూర్ణ భక్తి శ్రద్ధలతో లీనమై భగవంతుని స్మరించుకోవాలి. అలాగే, ఏ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందైనా, పూర్తి చేసిన తర్వాతనైనా ఇల్లాలికి (లేదా గృహానికి) నమస్కరించే సంప్రదాయం కూడా ఉంది.
భార్య భర్తకు ఎడమ వైపున ఎప్పుడు ఉండాలి?
కొన్ని ప్రత్యేక పరిస్థితులు, సేవ విశ్రాంతి సమయాలలో భార్య తన భర్తకు ఎడమ వైపున ఉండటం శుభప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి..
దానధర్మాలు:
సమాజానికి సేవ చేసేటప్పుడు, ఎవరికైనా దానాలు ఇచ్చేటప్పుడు మరియు ధార్మిక విధులను నిర్వర్తించేటప్పుడు భార్య ఎడమ వైపున ఉండాలి.
పెద్దల ఆశీర్వాదం:
గురువులకు, తల్లిదండ్రులకు, బ్రాహ్మణులకు, విప్రులకు, ఇతర కుల పెద్దలకు నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకునే సమయంలో భార్య ఎడమ వైపున నిలబడాలి.
ప్రయాణ సమయాల్లో:
కారు, బస్సు లేదా రైలు వంటి వాహనాలలో ప్రయాణిస్తున్నప్పుడు భార్య తన భర్తకు ఎడమ వైపున కూర్చోవాలని శాస్త్రాల అంతర్దృష్టి చెబుతోంది. ఇలా చేయడం వల్ల ప్రయాణం ఎటువంటి విఘ్నాలు లేకుండా సజావుగా, విజయవంతంగా సాగుతుంది.
నిద్రించేటప్పుడు:
రాత్రి వేళల్లో ఇంట్లో నిద్రపోయేటప్పుడు కూడా భార్య తన భర్తకు ఎడమ వైపున పడుకోవాలనే నియమం ఉంది. అందుకే స్త్రీని వామాంగి అని కూడా పిలుస్తారు.
పండితుల సలహా..
సనాతన ధర్మంలో పొందుపరిచిన ఇటువంటి నియమాలు కేవలం ఆచారాలు మాత్రమే కావు.. ఇవి జీవితంలో సానుకూల ఫలితాలను ఇవ్వడానికి రూపొందించబడ్డాయి. దంపతులు ఈ పవిత్రమైన ఆసన నియమాలను సరైన పద్ధతిలో అనుసరించడం ద్వారా, వారు చేసే ప్రతి కర్మకు పరిపూర్ణమైన, శుభప్రదమైన ఫలితాలు లభిస్తాయని పండితులు సలహా ఇస్తున్నారు.

