Varalakshmi Vratam: వరలక్ష్మీ వ్రతం ఎలా చేయాలంటే?
ఎలా చేయాలంటే?

Varalakshmi Vratam: వరలక్ష్మీ వ్రతం అనేది హిందూ సంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి. ముఖ్యంగా వివాహిత మహిళలు ఈ వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే విధానం చాలా పవిత్రమైనది మరియు శాస్త్రబద్ధమైనది. వ్రతానికి ముందు చేయవలసినవి ఎంటో తెలుసుకుందాం. వ్రతం రోజున తెల్లవారుజామునే లేచి తలంటు స్నానం చేసి, పరిశుభ్రమైన దుస్తులు ధరించాలి. ఇల్లు, పూజగది శుభ్రం చేసి ముగ్గులు వేయాలి. పూజ గదిలో ఒక పీటపై కొత్త బియ్యం పోసి దానిపై కలశాన్ని ఉంచాలి. కలశంలో నీరు, కొద్దిగా బియ్యం, పసుపు, కుంకుమ, రూపాయి నాణెం, తమలపాకులు, వక్కలు వేయాలి. కలశంపై మామిడి ఆకులు, దానిపై కొబ్బరికాయ ఉంచాలి. ఆ కొబ్బరికాయకు పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, లక్ష్మీదేవి ముఖాన్ని అలంకరించాలి. కలశానికి ఎర్రని లేదా పసుపు రంగు చీరతో అలంకరించాలి. పూలతో, ఆభరణాలతో లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా కలశాన్ని అలంకరించాలి.
పూజ విధానం:
ప్రాథమిక పూజలు: దీపం వెలిగించి, గణపతి పూజతో పూజను ప్రారంభించాలి. ఆ తర్వాత వ్రత సంకల్పం చెప్పుకోవాలి. లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళిని చదువుతూ అమ్మవారిని పూజించాలి. వరలక్ష్మీ వ్రత కథను చదివి, పూజలో పాల్గొన్న వారికి చెప్పాలి. తొమ్మిది రకాల పిండి వంటలు లేదా అమ్మవారికి ఇష్టమైన పరమాన్నం, పూర్ణాలు, వడలు, పాయసం వంటి నైవేద్యాలను సమర్పించాలి. పూజ పూర్తయిన తర్వాత హారతి ఇచ్చి, వ్రతంలో పాల్గొన్న వారందరికీ ప్రసాదం పంచిపెట్టాలి. తొమ్మిది పోగులు, తొమ్మిది ముడులు ఉన్న తోరాన్ని అమ్మవారికి సమర్పించి, ఆ తర్వాత దానిని చేతికి కట్టుకోవాలి.
వ్రత నియమాలు:
వ్రతం రోజున ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం తినడం, గొడవ పడటం వంటివి చేయకూడదు. వ్రతం రోజున ఇంటిలోని చెత్తను బయట పడవేయడం, చీపురుతో ఇల్లు ఊడ్చడం వంటివి చేయకూడదు. వ్రతం పూర్తయిన తర్వాత సాయంత్రం లేదా మరుసటి రోజు కలశాన్ని కదిలించి, బియ్యం, రూపాయి నాణేలను ఇంటిలోని బియ్యపు గిన్నెలో ఉంచాలి. నీటిని ఇంట్లో మొక్కలకు పోయాలి. వరలక్ష్మీ వ్రతం అనేది భక్తితో, శ్రద్ధతో ఆచరించే వ్రతం. నియమాలతో పాటు మనసులో అమ్మవారిపై అచంచలమైన నమ్మకం ఉంటే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది.
