A Spiritual Perspective: భగవంతుడు మన కళ్లముందే ఉన్నా ఎందుకు కనిపించడు?
కళ్లముందే ఉన్నా ఎందుకు కనిపించడు?

A Spiritual Perspective: భగవద్గీతలో కృష్ణుడు ఒకచోట అర్జునుడితో ఇలా అంటాడు: "అర్జునా! నేను నా 'యోగమాయ' అనే తెర వెనుక దాగి ఉంటాను. అందుకే అందరికీ నేను కనిపించను. నన్ను సామాన్య మనిషి అనుకుని అజ్ఞానులు మోసపోతుంటారు. కానీ నాకు పుట్టుక లేదు, చావు లేదు. నేను శాశ్వతుడిని అనే విషయం వారు గుర్తించలేరు." భగవంతుడు ఈ లోకంలోకి వచ్చినప్పుడు మనలాగే పుట్టినట్లు, పెరిగినట్లు, చివరకు మరణించినట్లు కనిపిస్తారు. కానీ అది కేవలం ఒక ప్రయోజనం కోసం పెట్టుకున్న రూపం మాత్రమే. అది నిజమైన జనన మరణం కాదు. భగవంతుడు తన శక్తిని (యోగశక్తిని) విశ్వమంతటా నింపి, రకరకాల రూపాల్లో ఉంటాడు. ఆ శక్తి వల్ల కలిగే భ్రమనే 'యోగమాయ' అంటారు. ఈ మాయ అనే తెర మన కళ్లకు అడ్డుగా ఉండటం వల్ల, లోపల ఉన్న దైవాన్ని మనం చూడలేకపోతున్నాం.
దీనిని మనం ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకోవచ్చు. ఆకాశంలో మేఘాలు వచ్చినప్పుడు "మేఘాలు సూర్యుడిని కప్పేశాయి" అంటాం. కానీ నిజానికి మేఘం ఎంత? సూర్యుడు ఎంత? మేఘం సూర్యుడిని కప్పలేదు, కేవలం మన 'చూపు'కు అడ్డుపడింది అంతే. అలాగే, మాయ అనేది భగవంతుడిని కప్పలేదు, మన బుద్ధిని కప్పేసింది. అందుకే ఆయన మనలోనే ఉన్నా మనం గుర్తించలేకపోతున్నాం. భగవంతుడు చెప్పిన 'నేను' అనే మాటకు లోతైన అర్థం ఉంది. మనలో ప్రతి ఒక్కరిలో ఉండే ప్రాణశక్తి (వ్యష్టి). ఈ ప్రపంచమంతటా నిండి ఉన్న పరమాత్మ (సమష్టి) రెండూ ఒకటే. ప్రతి జీవిలోనూ అంతర్యామిగా దేవుడు ఉన్నాడు. కానీ ఆయనకు ఒక రూపం, ఒక పేరు తగిలించగానే, మనం కేవలం ఆ రూపాన్నే చూస్తాం కానీ లోపల ఉన్న శక్తిని మర్చిపోతాం.
బృహదారణ్యక ఉపనిషత్తులో యాజ్ఞవల్క మహర్షి చెప్పినట్లు.. భగవంతుడు భూమిలో ఉంటాడు, గాలిలో ఉంటాడు, మనలోనూ ఉంటాడు. ఆయన అన్నిటినీ నియంత్రిస్తాడు కానీ అవేవీ ఆయన్ని గుర్తుపట్టలేవు. ఒక కంపెనీ బాస్ అన్ని విభాగాలను గమనిస్తూ, నియంత్రిస్తూ ఉంటారు. కానీ ఆయన నేరుగా ప్రతి పనిలోనూ కనిపించరు. అవగాహన లేని పనివారు ఆయనను కూడా తమలాంటి ఒక ఉద్యోగి అనుకుంటారు. కానీ సంస్థ గురించి పూర్తిగా తెలిసిన వారికి మాత్రమే ఆ బాస్ విలువ, ఆయన పవర్ ఏంటో తెలుస్తుంది. అలాగే, దేవుడు మన హృదయం అనే గోడకు అవతలి వైపు ఉన్నాడు. దట్టమైన గోడను దాటి చూడటం మనకు సాధ్యం కాదు. కానీ ఎవరైతే పూర్తి నమ్మకంతో, శ్రద్ధతో దేవుడిని తెలుసుకోవాలని ప్రయత్నిస్తారో (సాధన చేస్తారో), వారికి ఆ మాయ అనే తెర తొలగి అంతర్యామి దర్శనమిస్తాడు.

