Guru Dakshnia : దక్షిణ ఇవ్వకపోతే ఏమవుతుంది..? గురువులు ఏమంటున్నారు..?

దక్షిణ ఇవ్వడం గురించి మత గురువులు కీలక విషయాలు వివరించారు. పూజలు, గృహప్రవేశాలు, వివాహాలు, ఇతర శుభ సందర్భాలలో దక్షిణ అందించడం హిందూ సంస్కృతిలో ఒక పురాతన సంప్రదాయం. దక్షిణ ఇవ్వడం వెనుక ఉన్న మతపరమైన, సామాజిక ప్రాముఖ్యత గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం..
ఆలయంలో హారతి లేదా పూజారులకు దక్షిణ సమర్పించడం ఒక ముఖ్యమైన అంశం. ఈ దక్షిణ అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు. పూజ లేదా సేవ పట్ల కృతజ్ఞతను వ్యక్తపరిచే ఒక మార్గం. సరైన సమయంలో దక్షిణ ఇవ్వడం ముఖ్యమని గురువులు చెప్పారు. ‘‘కాంచనం కర్మ విమోచనం’’ అనే వాక్యాన్ని ఉటంకిస్తూ.. చేసిన పనికి వెంటనే దక్షిణ ఇవ్వడం ద్వారా మనం కర్మ నుండి విముక్తి పొందవచ్చని వివరించారు.
దక్షిణ ఆలస్యంగా ఇవ్వడం లేదా అస్సలు ఇవ్వకపోవడం వల్ల పాపం జరుగుతుందని కొంతమంది గురువులు అంటున్నారు. ఇది కేవలం మత విశ్వాసం మాత్రమే కాదు, సమాజంలో ఒక ముఖ్యమైన అంశం. ధనవంతులు లేదా అధికారంలో ఉన్నవారు కొన్నిసార్లు దక్షిణను మర్చిపోతారు. కానీ దీని వల్ల వారికి కర్మ నుండి విముక్తి లభించదట. కాబట్టి ఏదైనా సేవ లేదా పనికి సరైన సమయంలో దక్షిణ ఇవ్వడం అవసరమని సలహా ఇస్తున్నారు.
ఇది ఆ సేవా ప్రదాతలను గౌరవించడమే కాకుండా ఆత్మ సంతృప్తిని కూడా ఇస్తుంది. కానుకలు ఇవ్వడం, బిచ్చగాళ్లకు దానం చేయడం మొదలైనవి కూడా ఈ సంప్రదాయానికి చెందినవే. మొత్తం మీద దక్షిణ ఇవ్వడం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదని, జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడానికి మంచి విధానమని అని అర్థం చేసుకోవడం ముఖ్యం.
