Tirumala Brahmotsavam: బ్రహ్మోత్సవ వాహన సేవల్లో వెల్లివిరిసిన భారతీయ సాంస్కృతిక వైభవం
సాంస్కృతిక వైభవం

Tirumala Brahmotsavam: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక వైభవంతో పాటు భారతీయ కళలు, సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే మహోత్సవంగా నిలిచాయి. ఎనిమిది రోజుల పాటు తిరుమాడ వీధుల్లో నిర్వహించిన వివిధ వాహన సేవల్లో దేశవిదేశాల నుంచి తరలివచ్చిన కళాకారులు తమ కళా ప్రదర్శనలతో భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు.
ధ్వజారోహణం నుంచి అశ్వవాహనం వరకు శ్రీవారి వివిధ వాహన సేవల సందర్భంగా శాస్త్రీయ, జానపద కళారూపాలు కనువిందు చేశాయి. శేష, హంస, సింహ, ముత్యపు పందిరి, కల్పవృక్ష, సర్వభూపాల, మోహినీ, గరుడ, హనుమంత, గజ, సూర్యప్రభ, చంద్రప్రభ, రథ, అశ్వ వాహన సేవల్లో కళాబృందాల ప్రదర్శనలు భక్తుల్లో భక్తిభావాన్ని, సాంస్కృతిక స్ఫూర్తిని నింపాయి.
ప్రత్యేకంగా గరుడ వాహన సేవలో మణిపురి, మోహినీయట్టం, భరతనాట్యం, కథాకళి, కూచిపూడి, కథక్ వంటి శాస్త్రీయ నృత్యాలతో పాటు డ్రమ్ముల విన్యాసాలు, గోండల్, కరకట్టం, ఘంటా తదితర జానపద కళారూపాలు అలరించాయి. హనుమద్వాహనం, గజ వాహన సేవల్లో వివిధ రాష్ట్రాల జానపద కళలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవల్లో ఆధ్యాత్మికతతో కళల సమన్వయం భక్తులను ఆకట్టుకుంది.
20 రాష్ట్రాలు.. 2 దేశాలు.. 7,871 మంది కళాకారులు
ఈ ఏడాది బ్రహ్మోత్సవాల్లో ఆంధ్రప్రదేశ్, అస్సాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మణిపూర్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, బీహార్, ఒడిశా, పంజాబ్, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలతో పాటు జర్మనీ, సింగపూర్ దేశాల నుంచి కళాకారులు పాల్గొన్నారు.
మొత్తం 20 రాష్ట్రాలు, 2 దేశాల నుంచి 295 కళాబృందాలకు చెందిన 7,871 మంది కళాకారులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తమ ప్రాంతాల కళలు, సంస్కృతి, సంప్రదాయాలను ప్రదర్శించారు. తిరుమల బ్రహ్మోత్సవాల చరిత్రలో ఇంత భారీ సంఖ్యలో కళాకారులు పాల్గొనడం ప్రత్యేక విశేషంగా నిలిచింది.
భారతీయ సంస్కృతికి ప్రతీకగా బ్రహ్మోత్సవాలు
వివిధ ప్రాంతాలు, భాషలు, సంప్రదాయాలకు చెందిన కళాకారులు ఒకే వేదికపై తమ కళలను ప్రదర్శించడం ద్వారా “భిన్నత్వంలో ఏకత్వం” అనే భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని చాటిచెప్పారు. శ్రీవారి వాహన సేవలకు ఈ సాంస్కృతిక ప్రదర్శనలు మరింత శోభను తీసుకొచ్చాయి.
తిరుమల తిరుపతి దేవస్థానముల హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో పాల్గొన్న కళాబృందాలకు అవసరమైన ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పించారు.

