Kumkum Archana Only for Women: కుంకుమర్చన కేవలం స్త్రీలకేనా? పురుషులు చేస్తే కలిగే అద్భుత ఫలితాలివే..
పురుషులు చేస్తే కలిగే అద్భుత ఫలితాలివే..

Kumkum Archana Only for Women: హిందూ ధర్మంలో శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని ఆరాధించే అత్యంత శక్తివంతమైన ప్రక్రియలలో కుంకుమర్చన ఒకటి. సాధారణంగా ఇది కేవలం మహిళలు మాత్రమే చేసే పూజ అని చాలామంది భావిస్తారు. కానీ కుంకుమర్చనను కుల, మత, వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా చేయవచ్చని, దీనివల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు స్పష్టం చేస్తున్నారు.
ఎవరెవరు చేయవచ్చు?
పండితుల అభిప్రాయం ప్రకారం.. విద్యార్థులు, వ్యాపారవేత్తలు, రైతులు, ఉద్యోగులు ఇలా ప్రతి ఒక్కరూ కుంకుమర్చనను ఆచరించవచ్చు. దీనివల్ల పొందే ఫలితాలు ఇలా ఉన్నాయి:
పిల్లలు: చిన్న పిల్లల చేత కుంకుమర్చన చేయించడం వల్ల వారికి చిన్నతనం నుంచే మంచి సంస్కారం అలవడుతుంది. జ్ఞానం, ఏకాగ్రత, ఓర్పు పెరగడంతో పాటు దుష్ట శక్తుల ప్రభావం నుంచి వారికి రక్షణ లభిస్తుంది.
పురుషులు: పురుషులు శుక్రవారం నాడు లలితా సహస్రనామ పారాయణ చేస్తూ కుంకుమర్చన చేస్తే వ్యాపారంలో అద్భుతమైన లాభాలు వస్తాయి. ముఖ్యంగా దీర్ఘకాలికంగా పీడిస్తున్న అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుందని శాస్త్రం చెబుతోంది.
స్త్రీలు: మహిళలు కుంకుమర్చన చేయడం వల్ల దీర్ఘ సుమంగళి ప్రాప్తం లభిస్తుంది. సంతానంతో సఖ్యత, భర్తల్లో ఉన్న చెడు అలవాట్లు తొలగిపోవడం, ఆర్థికంగా ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతాయి.
ఆరోగ్యకరమైన కోణం
కేవలం ఆధ్యాత్మికమే కాకుండా కుంకుమర్చనలో ఆరోగ్య సూత్రాలు కూడా దాగి ఉన్నాయి.
శరీర రుగ్మతలు: అనారోగ్యంతో బాధపడుతున్న వారు, శారీరక ఇబ్బందులు ఉన్నవారు అమ్మవారికి కుంకుమతో అర్చన చేయడం ద్వారా సానుకూల శక్తిని పొంది, త్వరగా కోలుకుంటారు.
ఏకాగ్రత: కుంకుమను బొటనవేలు, మధ్యవేలు, ఉంగరపు వేలితో తీసి అమ్మవారి పాదాల చెంత సమర్పించడం వల్ల మనసు ప్రశాంతంగా మారి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
కుంకుమ విశిష్టత
కుంకుమలో ఉండే పసుపు, పటిక, సున్నం కలయిక శరీరంలోని నాడులను ప్రేరేపిస్తుంది. నుదుట కుంకుమ ధరించడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడటమే కాకుండా కనుబొమ్మల మధ్య ఉండే ఆజ్ఞా చక్రం ఉత్తేజితం అవుతుంది. కుంకుమర్చన సమయంలో వెలువడే ప్రకంపనలు ఇంట్లోని ప్రతికూల శక్తిని తరిమికొడతాయి.
విశ్వాసంతో చేసే కుంకుమర్చన కేవలం పూజ మాత్రమే కాదు అది మన ఆత్మవిశ్వాసాన్ని పెంచి సమాజంలో గౌరవప్రదమైన గుర్తింపును ఇస్తుంది. ఈ శుక్రవారం నుంచి మీ ఇంట్లో కూడా ఈ దివ్య క్రతువును ప్రారంభించి ఆ జగన్మాత ఆశీస్సులు పొందండి.

