Kaleshwaram's Unique Phenomenon: ఒకే పానవట్టం మీద రెండు శివలింగాలు.. కాళేశ్వరం మహిమలు ఇవే!
కాళేశ్వరం మహిమలు ఇవే!

Kaleshwaram's Unique Phenomenon: సాధారణంగా గర్భగుడిలో ఎన్ని శివలింగాలు ఉంటాయి. ఒక్కటే కదా. కానీ కాళేశ్వర ఆలయంలో రెండు శివలింగాలు గర్భగుడిలో పూజలందుకుంటాయి. అందులో ఒకటేమో ముక్తేశ్వరునిది (శివుడు), మరొకటేమో కాళేశ్వరునిది (యముడు). ఇటువంటి ప్రత్యేకత కలిగిన ఆలయం బహుశా ఇండియాలో ఎక్కడా కనిపించదేమో. కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహదేవ్ పూర్ మండలం కాళేశ్వరం గ్రామంలో వెలసిన ఆలయం. దట్టమైన అడవి మధ్యలో, చుట్టూ రమ్యమైన ప్రకృతి రమణీయతల మధ్యన, పవిత్ర గోదావరి నది ఒడ్డున వెలసిన ఈ క్షేత్రం చాలా ప్రాచీనమైనది. శివుడు, యముడి దేవాలయాలు ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడ గోదావరి, దాని ఉపనది అయిన ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహించడం వలన త్రివేణి సంగమ తీరమైన దక్షిణకాశీగా ప్రసిద్ధిచెంది, శ్రీశైల, ద్రాక్షారామ, కాళేశ్వరం అనే త్రిలింగక్షేత్రాలలో ఒకటిగా ఈ క్షేత్రం ప్రసిద్ధిగాంచింది. గర్భగుడిలో రెండు శివలింగాలు ఉండటం ఈ దేవాలయ ప్రత్యేకత. ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులందరికీ ముక్తేశ్వరస్వామి ముక్తిని ఇస్తుండడంతో యముడికి పనిలేకుండా పోయిందట. అప్పుడు యమధర్మరాజు స్వామిని వేడుకోగా, యమున్ని కూడా తన పక్కనే లింగాకారంలో నిల్చోమన్నాడట. ముక్తేశ్వరున్ని చూచి యమున్ని దర్శించకుండా వెళితే మోక్షప్రాప్తి దొరకదని వాళ్ళని నరకానికి తీసుకుపోవచ్చని శివుడు చెప్పాడట. అందుకే భక్తులు స్వామిని దర్శించుకొని, కాళేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటారు. ముక్తేశ్వరస్వామి లింగంలో మరో ప్రత్యేకత కూడా ఉంది. లింగంలో రెండు రంధ్రాలు ఉన్నాయి. ఈ రంధ్రంలో నీరు పోసి అభిషేకిస్తే ఆ నీరు అక్కడికి సమీపంలో ఉన్న గోదావరి, ప్రాణహిత సంగమ స్థలంలో కలుస్తుందని భక్తుల నమ్మకం. మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 5 గంటలకు మహాన్యాస రుద్రాభిషేకం జరుగుతుంది. సాయంత్రం 4.16 గంటలకు ముక్తీశ్వర, శుభానందదేవి కల్యాణోత్సవం, రాత్రి 12 గంటలకు గర్భగుడిలోని ద్విలింగాలకు మహాభిషేకం, లింగోద్భవ పూజ, చండీ హవనం, కాళరాత్రి హవనం నిర్వహిస్తారు. మసుసటిరోజు ఉదయం 5 గంటలకు మహాన్యాస రుద్రాభిషేకం, 11.30కి యాగశాలలో పూర్ణాహుతి, సదస్యము, మహదాశ్వీరాదం, పండిత సన్మానం, సాయంకాలం 4 గంటలకు కల్యాణోత్సవం, రాత్రి 8 గంటలకు నాకబలి, పవళింపు సేవతో శివరాత్రి ప్రత్యేక పూజలు ముగుస్తాయి.

