భద్రాద్రి వెనుక ఉన్న అద్భుత చరిత్ర!

Kancherla Gopanna Built the Temple: శ్రీరామనవమి అనగానే ప్రతి తెలుగువాడికి భద్రాచలంతో పాటు భక్త రామదాసు కూడా కచ్చితంగా గుర్తుకొస్తారు. అసలు భద్రాద్రి క్షేత్రం ఇంతటి మహోన్నత స్థాయికి చేరడంలో కంచర్ల గోపన్న అంటే మన రామదాసు చేసిన కృషి మరువలేనిది. 17వ శతాబ్దంలో తహసీల్దారుగా ఉన్న గోపన్న, ప్రజల నుండి వసూలు చేసిన ఆరు లక్షల వరహాల శిస్తును రామమందిర నిర్మాణానికి, స్వామివారి ఆభరణాల కోసం ఖర్చు చేశారు. ఈ విషయం తెలుసుకున్న అప్పటి గోల్కొండ నవాబు అబుల్ హసన్ తానీషా, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారన్న నెపంతో రామదాసును గోల్కొండ కోటలోని చీకటి గదిలో బంధించారు. పన్నెండేళ్ల పాటు జైలులో ఉండి కూడా ఆయన రాముడిని మర్చిపోకుండా మనసు కరిగేలా ఎన్నో కీర్తనలు ఆలపించారు.

జైలు గోడల మధ్య రామదాసు పడిన వేదన, ఆయన గొంతు నుండి జాలువారిన అమర కీర్తనలు నేటికీ భక్తుల గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. "పాహి రామప్రభో..", "ఏ తీరుగ నను దయచూచెదవో.." వంటి కీర్తనలు భక్తజనుల కళ్లలో నీళ్లు తెప్పిస్తాయి. చివరికి రామదాసు భక్తికి మెచ్చిన శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడితో కలిసి రామలక్ష్మణులుగా (రామోజీ, లక్ష్మోజీ) వేషం మార్చుకుని తానీషా నవాబు వద్దకు వెళ్లారు. రామదాసు చెల్లించాల్సిన ఆరు లక్షల మొహరీలను స్వయంగా చెల్లించి, తమ భక్తుడిని విడుదల చేయించారు. ఆ మొహరీలపై 'రామ' ముద్ర ఉండటం చూసి తానీషా ఆశ్చర్యపోయి, రామదాసు భక్తికి దాసోహమన్నారు.

అప్పటి నుండే తానీషా చక్రవర్తి సీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు పంపే సంప్రదాయాన్ని మొదలుపెట్టారు. కాలక్రమేణా నిజాం పాలకులు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ మరియు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాలు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాయి. రామదాసు చేయించిన చింతాకు పతకం, పచ్చల పతకం వంటి అరుదైన ఆభరణాలు నేటికీ భద్రాద్రి రామయ్యను అలంకరిస్తున్నాయి. కేవలం ఆలయాన్ని నిర్మించడమే కాకుండా, తన కీర్తనల ద్వారా రామనామ మాధుర్యాన్ని సామాన్యులకు కూడా చేరవేసిన మహనీయుడు రామదాసు. నేటి తరానికి ఈ చరిత్ర ఒక గొప్ప స్ఫూర్తిని ఇస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story