Karthika Masam: కార్తీక మాసం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలు, పవిత్ర నదీ తీరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శైవక్షేత్రాలకు భారీగా తరలివస్తున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ, గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. దీపాల వెలుగులు, హరిహర నామస్మరణలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో కార్తీకమాసం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మంగళవారం తెల్లవారుజాము నుంచే పవిత్ర గోదావరి నది తీరంలో భక్తుల సందడి నెలకొంది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి, గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాస పవిత్రతను పురస్కరించుకుని నదీ తీరంలో దీపాలు వెలిగించి, వాటిని నదిలో వదులుతున్నారు. తేలియాడుతున్న దీపాల కాంతులతో గోదావరి తీరం మెరిసిపోతోంది. భక్తుల హరిహర నామస్మరణలు, పూజలు, దీపారాధనలతో భద్రాచలం పరిసరాలు భక్తిమయంగా మారాయి.

స్నానాలు ఆచరించిన తర్వాత భక్తులు భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ ఉపాలయమైన కాశీ అన్నపూర్ణేశ్వర ఆలయాన్ని దర్శించుకుని, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల రాకతో ఆలయాలు, గోదావరి తీరం కిటకిటలాడుతూ కార్తీకమాస వైభవాన్ని చాటుతున్నాయి.

నంద్యాల జిల్లా శ్రీశైలంలో కార్తీక మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. నెలరోజుల పాటు అభిషేకాలను నిలిపివేశారు. శని, ఆది, సోమవారాల్లో స్పర్శ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు.

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వద్ద వశిష్ట గోదావరిలో కూడా కార్తీక మాస సందడి నెలకొంది. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, నదిలో దీపాలు వదులుతూ శివుడిని ప్రార్థిస్తున్నారు. వలంధర రేవులో సరైన ఏర్పాట్లు లేకపోవడంతో కొందరు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.

తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో భక్తులు పుణ్యస్నానాలు చేసి పరమేశ్వరుడికి పూజలు నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం మొదటి రోజు కావడంతో గోదావరిలో దీపాలు వదులుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో కార్తీక మాసం భక్తి, దీపాల కాంతి, ఆధ్యాత్మిక శోభతో వైభవంగా సాగుతోంది.

Next Story