Karthika Parva Deepotsavam: నేడు తిరుమలలో కార్తీక పర్వ దీపోత్సవం
కార్తీక పర్వ దీపోత్సవం

Karthika Parva Deepotsavam: తిరుమల శ్రీవారి ఆలయంలో నేడు సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. కార్తీక పౌర్ణమినాడు శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రతి నెలా నిర్వహించే పౌర్ణమి గరుడ సేవను, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది.
ఈ సందర్భంగా సాయంత్రం 5 గంటల నుండి 8.30 గంటల వరకు నేతి వత్తులతో దీపాలను వెలిగించి ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ ఆనంద నిలయంలో శ్రీవారికి హారతి ఇస్తారు. ఆ తర్వాత వరుసగా గర్భాలయంలో అఖండం, కులశేఖర పడి, రాములవారి మేడ, ద్వార పాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారుబావి, కల్యాణ మండపం, సభ అర, తాళ్లపాక అర, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండి వాకిలి, ధ్వజస్తంభం, బలి పీఠం, క్షేత్ర పాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద దీపాలను ఏర్పాటు చేస్తారు.

