TTD: టీటీడీ ఉద్యోగుల హౌస్ సైట్లకు సంబంధించి కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యకు పరిష్కారం లభించే దిశగా కీలక అడుగు పడిందని టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు తెలిపారు. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ అంశంపై ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించి, వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించడం ఎంతో సంతోషకరమని ఆయన అన్నారు.

మంగళవారం తిరుమలలోని తన క్యాంపు కార్యాలయంలో టీటీడీ ఉద్యోగుల హౌస్ సైట్ల అంశంపై బోర్డు సభ్యులు, ఉద్యోగ సంఘాల నాయకులతో చైర్మన్ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల హౌస్ సైట్ల అంశానికి సంబంధించి సుమారు రూ.230 కోట్ల వ్యయం అవుతుందని పరిశీలించిన అనంతరం, అనుభవం ఉన్న వ్యక్తులతో ప్రత్యేకంగా సబ్‌కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. సబ్‌కమిటీ ఈ అంశాన్ని కూలంకషంగా పరిశీలించి సమగ్ర ప్రతిపాదనను అందించిందని, ఆ ప్రతిపాదనను టీటీడీ పాలకమండలి సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారని చెప్పారు.

ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు ఇటీవల బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక అందించే సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఈ అంశంపై చర్చించామని తెలిపారు. ఉద్యోగుల సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించడంతో పాటు, టీటీడీ ఉద్యోగుల కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని స్పష్టంగా ఆదేశించారని చెప్పారు.

దీనికి తన పూర్తి సహకారం ఉంటుందని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం ఉద్యోగుల సంక్షేమం పట్ల ఆయనకున్న చిత్తశుద్ధికి నిదర్శనమని చైర్మన్ పేర్కొన్నారు.

బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో అధికారులు, సిబ్బంది ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నందున, బ్రహ్మోత్సవాలు పూర్తయిన వెంటనే ఉద్యోగుల హౌస్ సైట్లకు సంబంధించిన కార్యక్రమాన్ని కార్యరూపంలోకి తీసుకురావడానికి చర్యలు ప్రారంభిస్తామని తెలిపారు.

ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌పైనా దృష్టి

టీటీడీ ఉద్యోగుల కోసం ప్రతిపాదించిన ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ కూడా ముఖ్యమంత్రి ప్రాధాన్యంగా భావిస్తున్న ప్రాజెక్టు అని చైర్మన్ తెలిపారు. గతంలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలు, అనుమతులు ఉన్నాయని, ప్రస్తుతం దీనిని ఫేజ్-1, ఫేజ్-2గా చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారని చెప్పారు.

ఈ రెండు కార్యక్రమాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లి త్వరితగతిన కార్యరూపం దాల్చేలా చర్యలు చేపడతామని తెలిపారు.

పాత గెస్ట్‌హౌస్‌ల స్థానంలో టీటీడీ ఆధ్వర్యంలోనే కొత్త నిర్మాణాలు

తిరుమలలోని పాత గెస్ట్‌హౌస్‌ల స్థానంలో కొత్త గెస్ట్‌హౌస్‌ల నిర్మాణానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారని చైర్మన్ తెలిపారు.

ఏ గెస్ట్‌హౌస్‌ను అయితే తొలగిస్తామో, అదే ప్రదేశంలో అదే నమూనాలో కొత్త గెస్ట్‌హౌస్‌ను టీటీడీ ఆధ్వర్యంలోనే నిర్మించాలని, ప్రైవేట్ సంస్థలకు అప్పగించరాదని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. తిరుమలలో వసతి సౌకర్యాల విషయంలో అనవసరమైన కాంట్రాక్టర్ల వ్యవస్థ ఉండకూడదని, టీటీడీ స్వయంగా నిర్మించి నిర్వహించే విధానానికి ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారని తెలిపారు.

అదేవిధంగా అవసరం లేని విధంగా కొత్త గదులను అదనంగా నిర్మించకూడదని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారని చైర్మన్ వెల్లడించారు.

ఉద్యోగుల సహకారం కీలకం

కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల హౌస్ సైట్ల సమస్య పరిష్కారం దిశగా తమ పాలకమండలి ఆధ్వర్యంలో ముందడుగు పడటం ఎంతో సంతృప్తినిచ్చే విషయమని చైర్మన్ అన్నారు.

టీటీడీ ఉద్యోగులు భక్తుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు. తిరుమలకు వచ్చే భక్తులను సరైన మార్గంలో నడిపిస్తూ, వారికి సౌకర్యవంతమైన దర్శనం కల్పించడంతో పాటు అవసరమైన వసతులను అందించడంలో ఉద్యోగుల పాత్ర కీలకమని చెప్పారు.

ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి తమ బోర్డు పూర్తి సహకారం అందిస్తుందని, ఉద్యోగులు భక్తుల సంక్షేమాన్ని, టీటీడీ ప్రతిష్ఠను దృష్టిలో ఉంచుకుని విధులు నిర్వర్తించాలని చైర్మన్ ఉద్యోగులను కోరారు.

ఈ సమావేశంలో టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీమతి పనబాక లక్ష్మి, శ్రీ జ్యోతుల నెహ్రూతో పాటు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఉద్యోగుల హౌస్ సైట్ల సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్న టీటీడీ పాలకమండలికి, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడికి ఉద్యోగ సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story