Which Finger You Should Wear a Gold Ring On: బంగారు రింగ్ ఏ వేలుకు ధరించాలో తెలుసుకోండి.. ఈ వేలుకు ధరిస్తే ముప్పే..
ఈ వేలుకు ధరిస్తే ముప్పే..

Which Finger You Should Wear a Gold Ring On: హిందూ సంప్రదాయంలో బంగారానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాదు, అది లక్ష్మీదేవి స్వరూపం, సూర్యుడు, బృహస్పతి గ్రహాలకు చిహ్నం. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బంగారాన్ని ఏ వేలుకు ధరించాలి? ఏ వేలుకు ధరిస్తే అదృష్టం కలిసి వస్తుంది? ఏ వేలుకు ధరిస్తే కష్టాలు తప్పవు? అనే విషయాలపై నిపుణులు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఏ వేలుకు ధరిస్తే ఎలాంటి ఫలితం?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మన చేతిలోని ప్రతి వేలు ఒక గ్రహానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. బంగారం ధరించేటప్పుడు ఆ గ్రహ ప్రభావాలను దృష్టిలో ఉంచుకోవాలి.
చూపుడు వేలు : ఈ వేలు గురు గ్రహానికి చిహ్నం. విద్యార్థులు, ఉద్యోగస్తులు లేదా ఆత్మవిశ్వాసం పెంచుకోవాలనుకునే వారు ఈ వేలికి బంగారు ఉంగరం ధరించాలి. దీనివల్ల ఏకాగ్రత పెరిగి, వృత్తిపరంగా ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు.
ఉంగరపు వేలు: ఇది సూర్యుడు, శుక్రుడి స్థానం. ఈ వేలికి బంగారం ధరించడం వల్ల సమాజంలో కీర్తి ప్రతిష్టలు, గౌరవం పెరుగుతాయి. ముఖ్యంగా వివాహిత మహిళలు ఈ వేలికి ఉంగరం ధరించడం వల్ల కుటుంబంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయి.
మధ్య వేలు- ప్రమాదకరం: మధ్య వేలు శని గ్రహానికి చెందినది. బంగారం సూర్యుడికి సంబంధించిన లోహం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు, శని మధ్య శత్రుత్వం ఉంటుంది. అందుకే మధ్య వేలుకు బంగారు ఉంగరం ధరించడం వల్ల జీవితంలో అడ్డంకులు, విభేదాలు, అశాంతి ఏర్పడే అవకాశం ఉందని జ్యోతిష్కులు హెచ్చరిస్తున్నారు.
బంగారం ధరించడానికి సరైన రోజు.. పద్ధతి:
బంగారం నుంచి పూర్తి సానుకూల శక్తిని పొందాలంటే ఈ నియమాలను పాటించడం మంచిది:
శుభ దినం: బంగారం ధరించడానికి గురువారం అత్యంత పవిత్రమైన రోజు. ఎందుకంటే ఈ రోజుకు అధిపతి బృహస్పతి.
శుద్ధి ప్రక్రియ: కొత్త బంగారు ఆభరణాన్ని ధరించే ముందు దానిని పచ్చి పాలు లేదా గంగాజలంతో శుద్ధి చేయాలి.
మంత్రం: ఉంగరాన్ని ధరించే సమయంలో "ఓం బృహస్పతయే నమః" అనే మంత్రాన్ని జపించడం వల్ల గురు గ్రహ అనుగ్రహం లభించి త్వరగా శుభ ఫలితాలు అందుతాయి.
గుర్తుంచుకోవలసిన విషయం:
బంగారాన్ని కాళ్లకు పట్టీలుగా ధరించడం అశుభమని పెద్దలు చెబుతుంటారు. ఎందుకంటే బంగారం మహాలక్ష్మి స్వరూపం కాబట్టి, దానిని నడుము పైన మాత్రమే ధరించడం గౌరవప్రదం.

