Lakshmi Hayagriva Puja: లక్ష్మీ హయగ్రీవ పూజ: చదువులో రాణించాలంటే ఈ పరిహారాలు తప్పక పాటించండి..
ఈ పరిహారాలు తప్పక పాటించండి..

Lakshmi Hayagriva Puja: సనాతన ధర్మంలో జ్ఞానానికి, విద్యకు, జ్ఞాపకశక్తికి అధిదేవతగా శ్రీ లక్ష్మీ హయగ్రీవుడిని పూజిస్తారు. గుర్రం ముఖం, మానవ శరీరంతో విష్ణుమూర్తి ధరించిన అవతారమే హయగ్రీవ అవతారం. వేదాలను రక్షించి, జ్ఞానాన్ని లోకానికి అందించిన ఈ స్వామిని ఆరాధించడం వల్ల విద్యాబుద్ధులు పెరగడమే కాకుండా, పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారని విశ్వసిస్తారు. ముఖ్యంగా విద్యార్థులు, ఏకాగ్రత లోపంతో ఇబ్బందిపడేవారు లక్ష్మీ హయగ్రీవ స్వామిని ఎలా పూజించాలి? ఎలాంటి ఫలితాలు లభిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
లక్ష్మీ హయగ్రీవ పూజ వల్ల కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాలు..
జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి
చదివిన విషయాలు త్వరగా మర్చిపోవడం లేదా చదివేటప్పుడు మనస్సు లగ్నం కాకపోవడం వంటి సమస్యలతో బాధపడే విద్యార్థులు హయగ్రీవ స్వామిని ఉదయాన్నే ధ్యానించడం వల్ల వారిలో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి విశేషంగా పెరుగుతాయి.
విద్యా విజయం
లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామిని పూజించడం వల్ల విద్యతో పాటు ఐశ్వర్యం కూడా లభిస్తుంది. పరీక్షల సమయంలో భయం, ఒత్తిడి తొలగిపోయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
బుద్ధి కుశలత, జ్ఞాన వృద్ధి
హయగ్రీవుడు సమస్త విద్యలకు మూలకారకుడు. స్వామివారి అనుగ్రహం ఉంటే వాక్శుద్ధి లభించడమే కాకుండా సృజనాత్మక ఆలోచనలు, తార్కిక జ్ఞానం పెరుగుతాయి.
పూజించే విధానం, జ్యోతిష్య పరిహారాలు:
ఏకాగ్రత కోసం మంత్ర జపం:
ఉదయాన్నే స్నానం ముగించి, పూజాగృహంలో లక్ష్మీ హయగ్రీవ స్వామి చిత్రం ముందు దీపం వెలిగించాలి. "జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిమ్ | ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే ||" అనే శ్లోకాన్ని రోజూ 11 లేదా 108 సార్లు జపించడం ఎంతో శ్రేయస్కరం.
యాలకులు, యాలకుల మాల సమర్పణ:
హయగ్రీవ స్వామికి యాలకులు అంటే ఎంతో ప్రీతి. స్వామివారికి యాలకుల మాల వేయడం లేదా పూజలో యాలకులు నివేదన చేయడం వల్ల చదువులో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి.
పసుపు పువ్వులు - శనగల నైవేద్యం:
విష్ణు స్వరూపుడైన హయగ్రీవునికి పసుపు రంగు పువ్వులు సమర్పించి, నానబెట్టిన శనగలు లేదా కలకండను నైవేద్యంగా పెట్టాలి.
పుస్తకాల పూజ: విద్యార్థులు తమ చదువుకునే పుస్తకాలను స్వామివారి పాదాల వద్ద ఉంచి నమస్కరించుకుని అధ్యయనం ప్రారంభించాలి.

