Maha Shivaratri: మహాశివరాత్రి: ఫిబ్రవరి 15నా? 16నా? పండుగ తేదీ, ముహూర్తం ఇవే..
పండుగ తేదీ, ముహూర్తం ఇవే..

Maha Shivaratri: శివనామ స్మరణతో మారుమోగిపోయే పర్వదినం మహాశివరాత్రి వచ్చేస్తోంది. ప్రతి ఏటా ఫాల్గుణ మాసం కృష్ణ పక్ష చతుర్దశి నాడు ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. అయితే ఈ ఏడాది తిథి సమయాల వల్ల పండుగ ఎప్పుడు జరుపుకోవాలనే విషయంలో భక్తుల్లో నెలకొన్న సందిగ్ధతకు శాస్త్రోక్తమైన సమాధానం ఇక్కడ ఉంది.
ఫిబ్రవరి 15వ తేదీనే మహాశివరాత్రి.. ఎందుకు?
ఈ ఏడాది చతుర్దశి తిథి ఫిబ్రవరి 15, ఆదివారం సాయంత్రం 04:47 గంటలకు ప్రారంభమై..
ఫిబ్రవరి 16 సోమవారం సాయంత్రం 05:32 గంటలకు ముగుస్తుంది.
సాధారణంగా హిందూ పండుగలను ఉదయ తిథి ప్రకారం జరుపుకుంటారు. కానీ శివరాత్రికి నిశీథ కాలం అత్యంత ముఖ్యం. శివుడు అర్ధరాత్రి లింగ రూపంలో ఉద్భవించినందున, చతుర్దశి తిథి అర్ధరాత్రి వేళలో ఉన్న ఫిబ్రవరి 15వ తేదీనే మహాశివరాత్రిగా పరిగణించాలని పండితులు చెబుతున్నారు.
అభిషేక ముహూర్తాలు - నాలుగు ప్రహర పూజ సమయాలు:
మహాశివరాత్రి నాడు రాత్రంతా జాగరణ చేస్తూ నాలుగు జాముల్లో శివుడికి ప్రత్యేక అభిషేకాలు చేయడం విశేష ఫలితాన్నిస్తుంది.
మొదటి జాము: ఫిబ్రవరి 15, సాయంత్రం 06:11 – రాత్రి 09:23.. పాలతో
రెండవ జాము: ఫిబ్రవరి 15, రాత్రి 09:23 – అర్ధరాత్రి 12:35.. నెయ్యితో
మూడవ జాము: ఫిబ్రవరి 16, అర్ధరాత్రి 12:35 – తెల్లవారుజామున 03:47 పెరుగుతో
నాల్గవ జాము: ఫిబ్రవరి 16, తెల్లవారుజామున 03:47 – ఉదయం 06:59 తేనెతో
నిశీథ కాల ముహూర్తం: ఫిబ్రవరి 15 అర్ధరాత్రి 12:09 నుండి 01:01 వరకు. ఈ సమయంలో చేసే లింగోద్భవ పూజ అత్యంత ఫలప్రదం.
శివలింగ తత్వము - పండుగ విశిష్టత
మహాశివరాత్రి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది ప్రకృతికి, జీవునికి ఉన్న సంబంధానికి ప్రతీక. మనస్సు, బ్రహ్మ, మాయ, జీవుడు, బుద్ధి, పంచభూతాలైన ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమి అన్నీ కలిసి శివలింగంగా ఏర్పడతాయని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజు భక్తితో శివుడిని అర్చిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
ఓం నమః శివాయ.. ఈ ఏడాది శివరాత్రి ఆదివారం ప్రారంభమై సోమవారం ముగుస్తుండటం విశేషం. కాబట్టి ముహూర్తాలను గమనించి భక్తితో ఆ భోళాశంకరుని కృపకు పాత్రులు అవ్వండి.

