Mars Nakshatra Change on September 2: జ్యోతిష్య శాస్త్రంలో ధైర్యం, పరాక్రమం, భూమి మరియు ఆత్మవిశ్వాసానికి కారకుడైన కుజ గ్రహం త్వరలోనే తన నక్షత్ర సంచారాన్ని మార్చబోతున్నాడు. తీవ్రతకు మారుపేరైన రాహువు నక్షత్రం నుంచి జ్ఞానం, శ్రేయస్సుకు అధిపతి అయిన గురు గ్రహ నక్షత్రంలోకి కుజుడు ప్రవేశించనుండటం జ్యోతిష్యపరంగా అత్యంత కీలక పరిణామంగా మారింది.

సంచార సమయం - విశేషాలు

సెప్టెంబర్ 2న వేకువజామున 3:55 గంటలకు కుజుడు రాహువుకు చెందిన ఆర్ద్ర నక్షత్రాన్ని వీడి, దేవగురువు బృహస్పతి అధిపతిగా ఉన్న పునర్వసు నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. కుజుడు పునర్వసు నక్షత్రంలో సెప్టెంబర్ 23 వరకు సంచరిస్తాడు. ఆర్ద్ర నక్షత్రం పోరాటం, వేగవంతమైన మార్పులకు ప్రతీక కాగా, పునర్వసు నక్షత్రం పునరుద్ధరణ, విస్తరణ, ఆశావాదానికి చిహ్నం. కుజ-గురు నక్షత్రాల కలయిక కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఆర్థిక, కెరీర్ ఎదుగుదలను ప్రసాదించనుంది.

అత్యధిక ప్రయోజనం పొందే 4 రాశులు

మేష రాశి

మేష రాశికి కుజుడే అధిపతి కావడంతో ఈ నక్షత్ర మార్పు వీరికి విశేష ఫలితాలను ఇస్తుంది. ఆత్మవిశ్వాసం, నిర్ణయాత్మక శక్తి పెరుగుతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి.

మిథున రాశి

మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగ రంగాల్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగాన్వేషణలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. కొత్త ఉద్యోగంలో చేరాలనుకునే వారికి, కెరీర్‌లో ముందడుగు వేయాలనుకునే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి జాతకులకు దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అదృష్టం కలిసివచ్చి కుటుంబంలో ఉన్న కలతలు తొలగిపోతాయి. ఆర్థిక స్థిరత్వం ఏర్పడటానికి సరికొత్త మార్గాలు సుగమమవుతాయి.

ధనుస్సు రాశి

పునర్వసు నక్షత్ర అధిపతి అయిన గురుడే ధనుస్సు రాశికి కూడా అధిపతి కావడంతో ఈ సమయం వీరికి ఎంతో అనుకూలం. వ్యాపార, ఉద్యోగాల్లో లాభదాయక అవకాశాలు వస్తాయి. కొత్త ప్రాజెక్ట్‌లు లేదా వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది సరైన సమయం.

Next Story