Mercury Retrograde in Libra: జ్యోతిష్య శాస్త్రంలో బుధుడిని గ్రహాల రాకుమారుడుగా పరిగణిస్తారు. తెలివితేటలు, కమ్యూనికేషన్, వ్యాపారం, విద్య మరియు విశ్లేషణా సామర్థ్యానికి బుధుడే కారకుడు. మిథున, కన్యారాశులకు ఆధిపత్యం వహించే బుధుడు.. చంద్రుని తర్వాత అత్యంత వేగంగా రాశి సంచారం చేసే గ్రహాల్లో ఒకటి. ప్రస్తుతం తులారాశిలో కొనసాగుతున్న బుధుడు, అక్టోబర్ 24 నుంచి వక్రగతిలో తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు. బుధుడి తిరోగమనం ద్వాదశ రాశులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా బుధుడు వక్రించినప్పుడు పనులలో ఆకస్మిక జాప్యం, ఆర్థిక ఒడిదుడుకులు, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల బంధాలలో మనస్పర్థలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ కాలంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, మాటతీరును అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. బుధుడి వక్ర సంచారం కారణంగా ప్రధానంగా అప్రమత్తంగా ఉండాల్సిన 5 రాశుల వివరాలు:

మిథున రాశి: విద్యార్థులు, ఉద్యోగులు మరింత శ్రద్ధ పెట్టాలి

బుధుడు మిథున రాశికి పంచమ భావంలో వక్రగతిలో సంచరిస్తాడు. పని ప్రదేశంలో ప్రవర్తన విషయంలో ఎంతో సంయమనం అవసరం. మీ మాటలు లేదా చేతల వల్ల కార్యాలయంలో అనవసర సమస్యలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. జీవిత భాగస్వామితో చిన్నపాటి విషయాలకే వాదనలకు దిగకుండా ఉండటం మంచిది.

కన్యా రాశి: ఆర్థిక నిర్ణయాల్లో తొందరపాటు వద్దు

కన్యారాశికి రెండవ స్థానంలో బుధుడి తిరోగమనం జరుగుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టడం, ఇతరులకు అప్పులు ఇవ్వడం వంటి పనులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో ఆస్తి లేదా డబ్బుకు సంబంధించిన వివాదాలు ఉంటే సంయమనంతో, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. ఆఫీసులో బాధ్యతలను సకాలంలో పూర్తి చేయడానికి సాధారణం కంటే ఎక్కువ సమయం కేటాయించాల్సి రావచ్చు.

తులా రాశి: భాగస్వామ్యాల్లో వివాదాలకు ఆస్కారం

తులారాశిలోని లగ్న స్థానంలోనే బుధుడు వక్ర సంచారం చేయనున్నాడు. జీవిత భాగస్వామితో లేదా వ్యాపార భాగస్వాములతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. కొత్త ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు నిబంధనలు, డాక్యుమెంట్లను ఒకటికి రెండుసార్లు క్షుణ్ణంగా పరిశీలించాలి. గతంలో పరిష్కారం కాని పాత సమస్యలు మళ్లీ తెరపైకి రావచ్చు. సహనం పాటిస్తే పరిస్థితి అదుపులోకి వస్తుంది.

మకర రాశి: కెరీర్‌లో తొందరపాటు మార్పులు వద్దు

మకర రాశికి కర్మ స్థానమైన దశమ భావంలో బుధుడి వక్రగతి ఏర్పడుతోంది. చేసే పనులలో జాప్యం జరిగే సూచనలు ఉన్నాయి. ఆఫీసులో పై అధికారులతో మాట్లాడేటప్పుడు స్పష్టత పాటించాలి; అపార్థాలకు తావివ్వకూడదు. ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నా, కొత్త వ్యాపార డీల్స్ చేసుకోవాలనుకున్నా లాభనష్టాలను లోతుగా సమీక్షించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.

మీన రాశి: లావాదేవీల్లో స్పష్టత తప్పనిసరి

మీన రాశికి అష్టమ భావంలో బుధుడి సంచారం కొనసాగుతోంది.ఆర్థిక లావాదేవీలు, కొత్త పెట్టుబడుల విషయంలో తీవ్ర జాగ్రత్తలు పాటించాలి. పూర్తి సమాచారం, అవగాహన లేకుండా ఎక్కడా డబ్బును ఇన్వెస్ట్ చేయవద్దు. కుటుంబంలో, సన్నిహితులతో మాట్లాడేటప్పుడు స్పష్టంగా ఉండాలి. చిన్నపాటి అపార్థాలే పెద్ద విభేదాలకు దారితీయవచ్చు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టాలను నివారించవచ్చు.

Next Story