మహానంది గురించి ఈ విషయాలు తెలుసా?

Mahanandi: మహానంది ఏపీలోని నంద్యాల జిల్లా, మహానంది మండలం లో గల పుణ్య క్షేత్రం. నల్లమల కొండలకు ఇది తూర్పున ఉంది. దాని చుట్టూ అడవులు ఉన్నాయి. మహానందికి 15 కిలోమీటర్ల పరిధిలో నవనందులుగా పిలువబడే తొమ్మిది నంది పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. నవ నందులలో మహానంది ఒకటి. ఇక్కడ ఒక ముఖ్య పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన మహానందీశ్వర స్వామి ఆలయం ఉంది. ఇది మహా శివుడు మహానంది రూపంలో వెలసిన పుణ్యక్షేత్రం. శివుని గొప్ప ఉత్సవంగా పేరొందిన మహా శివరాత్రిని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, లేదా మార్చిలో ఘనంగా ఇక్కడ ఉత్సవం జరుగుతుంది.10వ శతాబ్దపు పలకల శాసనాలు ప్రకారం ఈ దేవాలయం అనేక సార్లు మరమ్మత్తులు జరిగినట్లుగా, పునర్నిర్మించబడినట్లు తెలుపుతున్నాయి.

మహానంది, శివనంది, వినాయకనంది, సోమనంది, ప్రథమనంది, గరుడనంది, సూర్యనంది, కృష్ణనంది (విష్ణునంది అని కూడా అంటారు) నాగనంది, ఈ ఆలయాలను నవనందులు అంటారు. కార్తీక మాసంలో సోమవారం రోజున నంద్యాల చుట్టు కొలువై ఉన్న నవనందుల దర్శనం జన్న జన్మల నుండి వెంటాడుతున్న పాప గ్రహ దోషాలన్ని పటాపంచలు అవుతాయని పెద్దల నానుడి. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల ఈ క్షేత్రాలన్నింటినీ దర్శిస్తే అన్ని దోషాలు తొలగి కుటుంబంలో ఆయురారోగ్యాలతో కోరిన కోర్కెలు ఇట్టే తీరుతాయని భక్తుల ప్రధాన విశ్వాసం. 14వ శతాబ్దం నందన మహారాజుల కాలంలో నవనందుల నిర్మాణ జరిగిందని పురాణాలు చెబుతున్నాయి.

వీటిని దర్శించాలంటే నంద్యాల పట్టణంలో శ్యామ్‌ కాల్వ గట్టున ప్రథమనందీశ్వర ఆలయం, ఆర్టీసి బస్టాండ్‌ దగ్గర ఉన్న శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో నాగనందీశ్వరుడు, ఆత్మకూరు బస్టాండ్‌ సమీపంలో సోమనందీశ్వరుడు, బండిఆత్మకూరు మండలం కడమకాల్వ సమీపంలో శివనందీశ్వరుడు, ఇక్కడి నుండి సుమారు 3 కిలో మీటర్ల దూరంలో కృష్ణనంది (విష్ణునంది), నంద్యాల మహానందికి వెళ్ళే దారిలో కుడి వైపుకు తమ్మడపల్లె గ్రామ సమీపంలో సూర్యనందీశ్వర ఆలయం, మహానంది క్షేత్రంలో మహానందీశ్వరుని దర్శనం అనంతరం వినాయక నందీశ్వరుడు, అనంతరం నంది విగ్రహం సమీపంలో గరుడనందీశ్వర ఆలయాలు కొలువై ఉన్నాయి. వీటికి ప్రత్యేకంగా నంద్యాల ఆర్టీసి వారు బస్సులను ఏర్పాటు చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story