Arunachaleswarar Temple: తమిళనాడులోని తిరువణ్ణామలైలో కొలువైన ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలం ఆలయానికి వెళ్లే భక్తులకు యాజమాన్యం కీలక ప్రకటన జారీ చేసింది. ఆలయ పవిత్రతను కాపాడటంతో పాటు దర్శనానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూసేందుకు సెప్టెంబర్ 1 నుండి ప్రాంగణంలోకి మొబైల్ ఫోన్లను పూర్తిగా నిషేధించారు. ఆలయ ప్రాచీన సంప్రదాయాలు, ఆచారాలను పరిరక్షించే లక్ష్యంతో తమిళనాడు హిందూ మత దేవాదాయ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

గర్భగుడితో పాటు ఆలయ ప్రాంగణంలో భక్తులు ఫోటోలు, వీడియోలు మరియు రీల్స్ తీయడం వల్ల ఇతర భక్తుల దర్శనానికి తీవ్ర అంతరాయం కలుగుతోందని అధికారులు గుర్తించారు. దర్శన సమయంలో భక్తులు ఫోన్లతో కాలయాపన చేయకుండా చూసేందుకే ఈ ఆంక్షలు విధించారు. అంతేకాకుండా ప్రముఖులు, వీఐపీలు వచ్చినప్పుడు కూడా ఫోటోలు, వీడియోలపై ప్రత్యేక ఆంక్షలు అమలు చేయనున్నారు. వీఐపీల పర్యటనల వివరాలను ముందస్తుగానే ఆలయ అధికారులకు సమాచారం అందించాల్సి ఉంటుంది.

భక్తుల సౌకర్యార్థం మొబైల్ ఫోన్లను భద్రపరిచేందుకు ప్రధాన గోపురాల వద్ద ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. తూర్పు వైపున ఉన్న రాజగోపురం వద్ద 2, ఉత్తర వైపున ఉన్న అమ్మాన్ టవర్ వద్ద 2, దక్షిణ వైపున ఉన్న తిరుమంజన టవర్ వద్ద 1 భద్రతా కేంద్రాన్ని సిద్ధం చేశారు. భక్తులు ఒక్కో మొబైల్‌కు రూ. 5 రుసుము చెల్లించి టోకెన్ తీసుకోవచ్చు. దర్శనం పూర్తయిన తర్వాత ఆ టోకెన్‌ను సమర్పించి తమ ఫోన్లను సురక్షితంగా తిరిగి పొందవచ్చు.

ఆలయ ప్రాంగణమంతా సీసీటీవీ కెమెరాల నిరంతర నిఘాలో ఉంటుందని యాజమాన్యం స్పష్టం చేసింది. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి ఆలయం లోపల మొబైల్ ఫోన్లు వాడితే, వాటిని వెంటనే స్వాధీనం చేసుకుని స్థానిక పోలీసులకు అప్పగిస్తామని, తగిన చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. భక్తులందరూ ఈ నిబంధనలకు సహకరించి ఆలయ పవిత్రతను కాపాడాలని కోరారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story