Garuda Seva: గరుడ సేవ కోసం తిరుమలకు చేరిన 9 శ్రీవారి గొడుగులు
శ్రీవారి గొడుగులు

Garuda Seva: తిరుమలలో వైభవంగా జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించనున్న గరుడ సేవకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ నేపథ్యంలో గరుడ సేవలో స్వామివారికి సమర్పించేందుకు చెన్నైకు చెందిన హిందూ ధర్మార్థ సమితి తరఫున 9 ప్రత్యేక గొడుగులు శుక్రవారం తిరుమలకు చేరుకున్నాయి.
చెన్నై నుంచి భక్తిశ్రద్ధలతో తీసుకొచ్చిన ఈ గొడుగులను హిందూ ధర్మార్థ సమితి ట్రస్టీ శ్రీ ఆర్.ఆర్. గోపాల్ జీ ఆధ్వర్యంలో తిరుమల శ్రీవారి ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరికి ఈ గొడుగులను అధికారికంగా అందజేశారు.
ప్రతి ఏడాది శ్రీవారి గరుడ సేవ సందర్భంగా చెన్నై హిందూ ధర్మార్థ సమితి గొడుగులను సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ ఏడాది కూడా సంప్రదాయాన్ని కొనసాగిస్తూ 9 గొడుగులను సమర్పించడం విశేషం. అంతేకాకుండా, శ్రీవారికి వరుసగా 22వసారి గొడుగులను సమర్పించడం ఈ కార్యక్రమానికి మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. గరుడ వాహనంపై మలయప్పస్వామి వారు భక్తులకు దర్శనమిచ్చే ఈ అపూర్వ ఘట్టాన్ని వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలివస్తారు. ఈ సందర్భంగా స్వామివారికి సమర్పించే గొడుగులకు కూడా విశిష్టమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది.

