Sins of Three Births Forgiven: ఒక్క బిల్వ పత్రం.. మూడు జన్మల పాప పరిహారం! శివయ్యకు బిల్వదళం ఎందుకు అంత ఇష్టం?
శివయ్యకు బిల్వదళం ఎందుకు అంత ఇష్టం?

Sins of Three Births Forgiven: పరమశివుని ఆరాధనలో బిల్వ పత్రం (మారేడు దళం) లేనిదే పూజ పూర్తి కాదు. కేవలం ఒక బిల్వ ఆకును భక్తితో సమర్పిస్తే, కోటి మంది కన్యల దానంతో సమానమైన పుణ్యం లభిస్తుందని జ్యోతిష్య నిపుణులు వివరించారు. శివలింగాన్ని బిల్వ పత్రాలతో పూజించడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు, నియమాలు ఇప్పుడు తెలుసుకుందాం.
త్రిదళం.. త్రిగుణాకరం..
మారేడు ఆకులో మూడు రేకులు కలిసి ఉండటం వెనుక ఒక లోతైన అర్థం ఉంది. "త్రిదళం త్రిగుణాకరం త్రినేత్రంచ త్రయాయుధం..." అనే శ్లోకం ప్రకారం.. ఈమూడు రేకులు సత్వ, రజో, తమో గుణాలకు ప్రతీకగా చెబుతారు. అంతేకాకుండా ఇవి శివుని మూడు కళ్ళను, ఆయన ఆయుధమైన త్రిశూలాన్ని సూచిస్తాయి. ఈ పత్రంతో పూజించడం వల్ల గత మూడు జన్మల పాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ మూడు రేకులలో మహాలక్ష్మి దేవి నివసిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
బిల్వ వృక్షం - పార్వతీ దేవి స్వరూపం..
బిల్వ చెట్టు ఆవిర్భావం వెనుక పురాణాల్లో అద్భుతమైన కథలు ఉన్నాయి. పార్వతీ దేవి తపస్సు చేస్తున్న సమయంలో ఆమె చెమట చుక్క నుంచి ఈ వృక్షం ఉద్భవించిందని స్కంద పురాణం చెబుతోంది. ఈ చెట్టు వేళ్లలో గిరిజ, కాండంలో మహేశ్వరి, ఆకులలో పార్వతి, పువ్వులలో గౌరి నివసిస్తారు. లక్ష్మీదేవి తపస్సుకు మెచ్చి శివుడు ఈ వృక్షాన్ని సృష్టించాడని మరికొన్ని గాథలు వివరిస్తున్నాయి. తెలియక చేసినా, శివలింగంపై బిల్వ పత్రాలు పడటం వల్ల ఒక వేటగాడు కైలాస ప్రాప్తిని పొందాడని శుక ముని కథ మనకు గుర్తుచేస్తుంది.
పూజ చేసేటప్పుడు ఈ నియమాలు మరువకండి..
బిల్వ పత్రాలను సమర్పించేటప్పుడు కొన్ని పద్ధతులు పాటించాలని పండితులు సూచిస్తున్నారు:
శుభ్రత:
ఆకులను నీటితో శుభ్రంగా కడిగిన తర్వాతే సమర్పించాలి. ఆకులు ఎక్కడో ఒకచోట తెగిపోకుండా ఉండాలి.
పవిత్ర దినాలు: మహాశివరాత్రి, సోమవారాలు, మాస శివరాత్రి, అష్టమి మరియు అమావాస్య రోజుల్లో బిల్వ పూజ విశేష ఫలితాలను ఇస్తుంది.
తాజాదనం:
ఒకవేళ తాజా ఆకులు దొరకకపోతే, ఎండిన బిల్వ ఆకులను కూడా పూజకు ఉపయోగించవచ్చు. ఎందుకంటే బిల్వ పత్రం ఎప్పటికీ పవిత్రమైనదే.

