శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

Ontimitta Sri Kodandarama Swamy: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో నిర్వహించనున్న వార్షిక శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు భక్తి భావపూర్వక వాతావరణంలో వేదమంత్రాల నడుమ గురువారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. పురాతన చారిత్రక ప్రాశస్త్యాన్ని కలిగిన ఈ ఆలయంలో ఒకే శిలపై శ్రీ సీతారామ లక్ష్మణుల దివ్య మూర్తులు వెలసి ఉండటంతో ఒంటిమిట్టను “ఏకశిలానగరం”గా కూడా పిలుస్తారు. ఈ పవిత్రక్షేత్రంలో మార్చి 26 నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు జరిగే బ్రహ్మోత్సవాల కోసం ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో ముస్తాబైంది.

గురువారం ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి, పరివార దేవతలకు తిరుమంజనం నిర్వహించారు. అనంతరం మూలవర్లకు వ్యాసాభిషేకం, ఆరాధన, అర్చనలను శాస్త్రోక్తంగా చేశారు. సాయంత్రం 6 గంటల నుండి అర్చకుల వేదమంత్రాల నడుమ అంకురార్పణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి విష్వక్సేన పూజ, కలశ ప్రతిష్ఠ, కలశపూజ, వాసుదేవ పుణ్యాహవచనం, కంకణధారణ వంటి శాస్త్రోక్త కర్మలను నిర్వహించారు. అనంతరం పుట్టమన్ను సేకరణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది.

మార్చి 27న ధ్వజారోహణం

శుక్రవారం ఉదయం 9.30 నుండి 10.15 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించనున్నారు. దీంతో శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం కానున్నాయి. అనంతరం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీరామనవమి ఆస్థానం నిర్వహిస్తారు. సాయంత్రం 4 నుండి 7 గంటల వరకు పోతన జయంతి కార్యక్రమం, కవి సమ్మేళనం జరుగనుంది. రాత్రి 7 నుండి 9 గంటల వరకు శేష వాహనసేవను భక్తులు వీక్షించనున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story