Performing Hanuman Jayanti Puja: హనుమాన్ జయంతి పూజ చేస్తున్నారా? ఈ నియమాలు తెలుసుకోండి!
ఈ నియమాలు తెలుసుకోండి!

Performing Hanuman Jayanti Puja: ధైర్యానికి, విజయానికి, అచంచల భక్తికి మారుపేరు ఆంజనేయ స్వామి. కలియుగంలో భక్తుల కష్టాలను తీర్చే చిరంజీవిగా హనుమంతుడిని కొలుస్తాం. ప్రతి ఏటా వైశాఖ బహుళ దశమి నాడు హనుమాన్ జయంతిని వైభవంగా జరుపుకుంటాం. మరి 2026వ సంవత్సరంలో హనుమాన్ జయంతి ఎప్పుడు వచ్చింది? పూజా సమయం , నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పరాభవ నామ సంవత్సరంలో వచ్చే ఈ హనుమాన్ జయంతికి ఎంతో ప్రత్యేకత ఉంది. పంచాంగం ప్రకారం, వైశాఖ బహుళ దశమి మే 11 ఉదయం 10 గంటల 17 నిమిషాలకు ప్రారంభమై.. మే 12 మంగళవారం ఉదయం 9 గంటల 55 నిమిషాల వరకు ఉంటుంది. ఉదయ తిథిని అనుసరించి, ఈ ఏడాది మే 12, మంగళవారం నాడు హనుమాన్ జయంతిని జరుపుకోవాలి. స్వామికి ఇష్టమైన మంగళవారం రోజే జయంతి రావడం భక్తులకు ఎంతో శుభప్రదం.
హనుమజ్జయంతి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి, తలస్నానం చేసి శుచిగా పూజ ప్రారంభించాలి. ఆంజనేయ స్వామితో పాటు శ్రీ సీతారాములను భక్తితో కొలవాలి. స్వామికి ఎర్ర చందనం, అక్షింతలు, ఎర్రని పుష్పాలు సమర్పించాలి. వీలైతే దగ్గరలోని ఆలయానికి వెళ్లి స్వామికి సింధూర అర్చన చేయించాలి. ఈ పవిత్ర పర్వదినాన హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పఠించడం వల్ల సకల దోషాలు తొలగిపోతాయి. ‘‘ఓం హం హనుమాన్ నమః’’ అనే మంత్రాన్ని జపించడం వల్ల స్వామి అనుగ్రహం లభిస్తుంది.
ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి, నేలపైనే నిద్రించాలి. స్వామికి ఎంతో ఇష్టమైన అప్పాలను నైవేద్యంగా సమర్పించాలి. ఆంజనేయ స్వామి అవతారంగా భావించే కోతులకు బెల్లం లేదా అరటి పండ్లను ఆహారంగా ఇవ్వడం వల్ల విశేష ఫలితం ఉంటుంది. దానధర్మాలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యంగా ఈ రోజున మాంసం, మద్యం, శృంగారం వంటి వాటికి దూరంగా ఉంటూ పూర్తి బ్రహ్మచర్యాన్ని పాటించాలి.

