Pitru Paksha: పితృ పక్షంలో పితృదేవతల ఆశీస్సుల కోసం రోజూ ఒక దీపం చాలు.. ఎక్కడ, ఎలా వెలిగించాలి?
ఎక్కడ, ఎలా వెలిగించాలి?

Pitru Paksha: హిందూ సనాతన ధర్మంలో పితృదేవతలకు విశిష్ట స్థానం ఉంది. పితృ పక్షం రోజుల్లో పితృదేవతల ఆత్మశాంతి కోసం, వారి అనుగ్రహం పొందడం కోసం శ్రాద్ధ కర్మలు, తర్పణాలు, పిండ ప్రదానం, అన్నదానాలు చేస్తుంటారు. అయితే, పెద్ద ఎత్తున పూజలు చేయలేని వారు సైతం ఇంట్లో రోజూ నిష్టగా కేవలం ఒక్క దీపం వెలిగించడం ద్వారా పితృదేవతలను ప్రసన్నం చేసుకోవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి. పితృ పక్ష కాలంలో పితృ దీపం ఎలా వెలిగించాలి, ఏ దిశలో ఉంచాలి అనే పూర్తి వివరాలు:
దక్షిణ దిశలోనే ఎందుకు వెలిగించాలి?
ధార్మిక విశ్వాసాలు, వాస్తు శాస్త్రం ప్రకారం దక్షిణ దిశను పితృదేవతలు, యమధర్మరాజుకు చెందిన దిశగా పరిగణిస్తారు. అందుకే పితృదేవతల పేరుతో వెలిగించే దీపాన్ని ఎల్లప్పుడూ ఇంటి దక్షిణ దిశలోనే ఉంచడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. కేవలం పితృ పక్షంలోనే కాకుండా సాధారణ రోజుల్లో కూడా పూర్వీకుల స్మరణార్థం ఈ దిశలో దీపం వెలిగించవచ్చు.
ఏ నూనె లేదా నెయ్యి ఉపయోగించాలి?
పితృదేవతల ప్రీత్యర్థం వెలిగించే దీపానికి నువ్వుల నూనె లేదా ఆవనూనె వాడటం ఎంతో శ్రేష్ఠం. ఒకవేళ ఇవి అందుబాటులో లేకపోతే ఆవు నెయ్యితో కూడా దీపం వెలిగించవచ్చు. దీపానికి వాడే నూనె లేదా నెయ్యి స్వచ్ఛమైనదై ఉండాలి.
దీపం ఎలా వెలిగించాలి?
దీపాన్ని వెలిగించేటప్పుడు ప్రమిదలోని దీపపు జ్వాల దక్షిణ దిశ వైపు చూస్తున్నట్లుగా ఉండాలి. ప్రమిదను నేరుగా నేలపై పెట్టకూడదు. నేలపై కొద్దిగా నల్ల నువ్వులు లేదా బియ్యం పోసి, వాటిపై ఆసనంలా ప్రమిదను ఉంచి దీపం వెలిగించాలి.
ఇంట్లో ఏయే ప్రదేశాల్లో వెలిగించవచ్చు?
ఇంటి దక్షిణ దిశ: ఇంటి8 లోపల దక్షిణ దిక్కు మూలలో దీపాన్ని ఉంచవచ్చు.
ప్రధాన ద్వారం: ఇంటి ప్రధాన ద్వారం వద్ద దక్షిణ మూలలో దీపం పెట్టడం పితృదేవతల స్వాగతానికి చిహ్నంగా భావిస్తారు.
రావి చెట్టు కింద:
రావి చెట్టులో పితృదేవతల వాసం ఉంటుందని నమ్ముతారు కాబట్టి, సాయంత్రం వేళ రావి చెట్టు మొదట్లో దీపం వెలిగిస్తే పితృదోషాలు తొలగిపోతాయి.
నీటి నిల్వ ఉండే ప్రదేశం:
ఇంట్లో మంచి నీళ్లు ఉంచే కుండ లేదా బిందె సమీపంలో కూడా పితృదేవతల పేరుతో దీపం వెలిగించే సంప్రదాయం ఉంది.
ఎప్పుడు వెలిగించాలి? ఏం ప్రార్థించాలి?
పితృ దీపాన్ని సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత వెలిగించడం అత్యంత శుభప్రదం. దీపం వెలిగించిన తర్వాత రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ.. "ఓ పితృదేవతలారా! మాపై మీ కరుణాకటాక్షాలు ఉంచండి. మేము తెలిసి తెలియక ఏవైనా తప్పులు చేసి ఉంటే క్షమించి, మా కుటుంబాన్ని ఆశీర్వదించండి" అని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి.
శ్రద్ధ, భక్తితో వెలిగించే ఒక్క చిన్న దీపం పితృదేవతల ఆత్మకు శాంతిని చేకూర్చడమే కాకుండా, ఇంట్లోని ప్రతికూల శక్తులను పారద్రోలి కుటుంబంలో సుఖసంతోషాలను నింపుతుంది.

