Puri Jagannath Rath Yatra: పూరీ జగన్నాథుడి రథయాత్ర: రథానికి వాడే ఎరుపు, పసుపు రంగుల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే..
ఆధ్యాత్మిక రహస్యం ఇదే..

Puri Jagannath Rath Yatra: పూరీ జగన్నాథుడి రథయాత్ర కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు, కోట్ల మంది భక్తుల నమ్మకానికి ప్రతీక. ఈ యాత్రలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవిలు మూడు వేర్వేరు రథాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఈ రథాల తయారీ నుండి వాటికి వేసే రంగుల వరకు ప్రతి ఒక్కదాని వెనుక ఒక లోతైన ఆధ్యాత్మిక అంతరార్థం దాగి ఉంది. ముఖ్యంగా, జగన్నాథుడు స్వయంగా అధిరోహించే రథానికి కేవలం ఎరుపు, పసుపు రంగుల వస్త్రాలనే ఉపయోగిస్తారు. సనాతన ధర్మంలో ఈ రెండు రంగులకు ఉన్న ప్రత్యేక విశిష్టత మరియు భక్తి ప్రాధాన్యత గురించి జ్యోతిష్య, ఆధ్యాత్మిక పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం..
పసుపు రంగు - జ్ఞానం, సాత్వికతకు ప్రతీక:
హిందూ సంప్రదాయంలో పసుపు రంగును అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. జగన్నాథుడిని సాక్షాత్తూ ఆ శ్రీమహావిష్ణువు స్వరూపంగా కొలుస్తారు. విష్ణుమూర్తికి పసుపు రంగు అత్యంత ప్రీతిపాత్రమైనది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పసుపు రంగు బృహస్పతి (గురు గ్రహం)కి సంకేతం. ఇది మనస్సులో జ్ఞానాన్ని, సాత్విక గుణాన్ని, ఆధ్యాత్మిక చింతనను పెంపొందిస్తుంది.
జగన్నాథుడి రథానికి పసుపు రంగు వస్త్రాన్ని కప్పడం అంటే భక్తుల జీవితాల్లోని అజ్ఞానమనే చీకట్లను తొలగించి, జ్ఞానకాంతిని నింపడమే అని అర్థం.
ఎరుపు రంగు- శక్తి, మంగళప్రదం..
ఎరుపు రంగు సృష్టిలోని అపారమైన శక్తికి, మంగళానికి సూచిక. ఇది మానసిక ఉత్సాహాన్ని, ధైర్యాన్ని మరియు రక్షణను ఇస్తుంది.
జగన్నాథుడి రథంపై ఉండే ఎరుపు రంగు భక్తులలోని నకారాత్మక శక్తిని దూరం చేసి, సకల శుభాలను చేకూరుస్తుందని నమ్ముతారు.
భగవంతుని రక్షణ, కరుణ ఎల్లప్పుడూ భక్తులపై ఉంటుందని చెప్పడానికి రథంపై ఉన్న ఎరుపు రంగు ఒక సంకేతం.
ఎరుపు-పసుపు కలయికే ఎందుకు?
సృష్టి సమతుల్యంగా సాగడానికి జ్ఞానం(పసుపు) , దాన్ని నడిపించే శక్తి (ఎరుపు) రెండూ సమానంగా అవసరం. ఈ రెండింటి కలయికే పరమాత్మ తత్వానికి సంపూర్ణ రూపం. అందుకే జగన్నాథుడి రథాన్ని ఈ రెండు రంగుల వస్త్రాలతో అత్యంత సుందరంగా అలంకరిస్తారు. ఈ రథాన్ని కళ్లారా చూసినా, కనీసం ఆ రథాన్ని లాగే తాడును తాకినా సరే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

