Puri Jagannath Temple: ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఎన్నో అద్భుతాలు, రహస్యాలకు నిలయమైన ఈ పుణ్యక్షేత్రం గురించి సోషల్ మీడియాలో ఒక వింత ప్రచారం విపరీతంగా సాగుతోంది. అవివాహిత జంటలు కలిసి ఈ ఆలయాన్ని దర్శిస్తే, వారి బంధం ముక్కలవుతుందని, వారు ఎప్పటికీ పెళ్లి చేసుకోలేరని కొందరు గట్టిగా నమ్ముతుంటారు. దీనికి రాధారాణి శాపం కారణమనే ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. అయితే ఈ ప్రచారంలో ఎంతవరకు నిజముంది? పురాణాలు, ఆలయ పూజారులు దీనిపై ఏమంటున్నారు? ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

ప్రచారంలో ఉన్న ఆసక్తికర కథ ఇదీ:

జనబాహుళ్యంలో ఉన్న కథనం ప్రకారం.. ఒకసారి ద్వాపర యుగంలో రాధారాణి, శ్రీకృష్ణుడి జగన్నాథ అవతారాన్ని దర్శించుకోవడానికి పూరీ క్షేత్రానికి వచ్చింది. అయితే ఆలయ ద్వారం వద్ద ఉన్న పూజారులు ఆమెను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ ఆలయంలోకి కేవలం భగవంతుడి భార్యలకు మాత్రమే ప్రవేశం ఉందని, ప్రేమిరాలైన రాధకు అనుమతి లేదని చెప్పారట. దీనితో తీవ్ర మనస్తాపానికి, కోపానికి గురైన రాధారాణి.. "ఇకపై ఎవరైనా అవివాహిత జంట కలిసి ఈ ఆలయంలో అడుగుపెడితే, వారి ప్రేమ సఫలం కాదు, వారి బంధం విడిపోతుంది" అని శపించిందని కొందరు ప్రచారం చేశారు. ఇటీవల కొందరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా దీనిపై మాట్లాడటంతో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశమైంది.

నిజం vs అపోహ: అసలు వాస్తవం ఏంటి?

పూరీ జగన్నాథ ఆలయ పండితులు, చరిత్రకారులు మరియు నిపుణులు ఈ ప్రచారాన్ని పూర్తిగా ఖండించారు. దీని వెనుక ఉన్న అసలు వాస్తవాలు ఇవే..

ఆలయ నిబంధనలలో ఎక్కడా లేదు:

పూరీ జగన్నాథ ఆలయ యాజమాన్యం గానీ, అధికారిక నియమావళి గానీ అవివాహిత జంటల ప్రవేశాన్ని ఎప్పుడూ నిషేధించలేదు. భక్తులెవరైనా సరే, సాంప్రదాయ దుస్తులలో ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చు.

పురాణ ఆధారాలు లేవు:

జగన్నాథుని చరిత్రను తెలిపే స్కంద పురాణం లేదా నీలాద్రి మహోదయం'

వంటి ప్రాచీన గ్రంథాలలో రాధారాణి ఇలాంటి శాపం ఇచ్చినట్లు ఎక్కడా ఎలాంటి ఆధారాలు లేవు. ఇది కేవలం కాలక్రమేణా పుట్టుకొచ్చిన ఒక స్థానిక అపోహ మాత్రమే.

భక్తుల మనోభావాలు - వివాదం:

సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం వల్ల లక్షలాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆలయ పూజారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసిన కొందరు ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్లు భక్తులకు, ఒడిశా ప్రజలకు బహిరంగ క్షమాపణలు కూడా చెప్పారు.

భగవంతుడు ఎప్పుడూ ప్రేమను, బంధాలను జోడిస్తాడే కానీ విడదీయడు. పూరీ జగన్నాథుని ఆలయంలో ప్రేమికులు లేదా పెళ్లికాని జంటలు వెళ్తే విడిపోతారనేది కేవలం ఒక అపోహ మాత్రమే. కాబట్టి, ఇలాంటి పుకార్లను నమ్మకుండా, భక్తిభావంతో జగన్నాథుడిని దర్శించుకోవచ్చని పండితులు స్పష్టం చేస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story