Sri Lakshmi Narasimha Swamy Temple: తరిగొండలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి సుమారు 200 ఏళ్ల చారిత్రక నేపథ్యం కలిగిన పుష్కరిణిని రూ.1.50 కోట్ల టీటీడీ నిధులతో పునరుద్ధరించేందుకు సోమవారం శంకుస్థాపన జరిగింది. టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు, బోర్డు సభ్యులు, పీలేరు ఎమ్మెల్యే శ్రీ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, జేఈవో డా. ఎ. శరత్ తదితరులతో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు మాట్లాడుతూ, శ్రీ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జన్మస్థలమైన తరిగొండలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ పుష్కరిణి పునరుద్ధరణకు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందన్నారు. తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ పేరుతో అన్నప్రసాదాల వితరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. పుష్కరిణి పునరుద్ధరణ పనులను నాణ్యతా ప్రమాణాలతో, వేగంగా పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ మాట్లాడుతూ, శ్రీ వేంకటేశ్వరస్వామివారిని స్మరించడంతో సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందుతాయని అన్నారు. ధర్మప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరూ ఆలయాలను సందర్శించి భక్తిభావాన్ని పెంపొందించుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 5 వేల ఆలయాల నిర్మాణానికి టీటీడీ బోర్డు శ్రీకారం చుట్టిందని తెలిపారు. తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ పుష్కరిణి పునరుద్ధరణ పనులను నిర్ణీత గడువులో పూర్తి చేస్తామని చెప్పారు.

Next Story