Sabarimala Ayyappa Darshan Online Booking: కేరళలోని పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం తరలివస్తారు. ముఖ్యంగా డిసెంబరు, జనవరి నెలల్లో మండల పూజ, మకరజ్యోతి దర్శన సందర్భంగా భక్తుల రద్దీ అమాంతం పెరుగుతుంది. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు బంగారు మెట్లను ఎక్కి శరణుఘోషతో స్వామి వారిని దర్శించుకుంటారు. ఈ రద్దీ కారణంగా గతంలో తొక్కిసలాటలు, ప్రమాదాలు జరిగాయి. దర్శనం కోసం 12 గంటలకు పైగా వేచి ఉండాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది.

ఈ సమస్యలను నివారించేందుకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (TDB) ఆన్‌లైన్ దర్శన బుకింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. భక్తులు ముందుగానే టైమ్, స్లాట్ బుక్ చేసుకోవడం ద్వారా త్వరితగతిన దర్శనం పొందవచ్చు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారికి సాధారణంగా 4-5 గంటల వ్యవధిలోనే దర్శనం లభిస్తుందని గురుస్వాములు సూచిస్తున్నారు. మాలదారులు (భక్తులు) ఈ విధానాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని వారు హితవు పలుకుతున్నారు.

ఆన్‌లైన్ బుకింగ్ ప్రక్రియ చాలా సులభం. భక్తులు అధికారిక వెబ్‌సైట్ sabarimalaonline.org లేదా virtualq.sabarimalaonline.org ను సందర్శించాలి. అక్కడ మొబైల్ నంబర్, ఈమెయిల్‌తో రిజిస్ట్రేషన్ చేసుకుని, ఏ రోజు, ఏ సమయంలో దర్శనం చేసుకోవాలో ఎంచుకోవాలి. పేరు, ఆధార్ కార్డు, ఫోటో, చిరునామా, రాష్ట్రం వంటి వివరాలు నమోదు చేయాలి. బుకింగ్ పూర్తయిన తర్వాత QR కోడ్‌తో కూడిన రశీదు లభిస్తుంది. ఈ రశీదును పంబాలోని క్యూ కౌంటర్ వద్ద కేరళ పోలీసులకు చూపించినట్లయితే వేగంగా దర్శనానికి అనుమతి లభిస్తుంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ లేని వారు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తుంది.

ప్రస్తుత మండల-మకరవిళక్కు సీజన్‌లో రెండు విడతల్లో ముందస్తు బుకింగ్ అందుబాటులో ఉంది. నవంబరు 30 నుంచి డిసెంబరు 24 వరకు, అలాగే డిసెంబరు 31 నుంచి జనవరి 12 వరకు స్లాట్లు బుక్ చేసుకోవచ్చు. రోజుకు సుమారు 80,000 మంది భక్తులకు దర్శనం పరిమితం. వీరిలో 66,000 స్లాట్లు ఆన్‌లైన్ వర్చువల్ క్యూ ద్వారా, మిగిలినవి స్పాట్ బుకింగ్ ద్వారా లభిస్తాయి. నవంబరు 30 వరకు అదనంగా రోజుకు 5,000 స్లాట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. స్పాట్ బుకింగ్ నీలక్కల్, ఎరుమేలి, వండిపెరియార్ సత్రం వంటి చోట్ల మాత్రమే ఉంటుంది. పంబాలో స్పాట్ బుకింగ్ సదుపాయం లేదు.

రద్దు చేసిన స్లాట్లు 8 గంటల తర్వాతే మళ్లీ అందుబాటులోకి వస్తాయి. ఇది బల్క్ బుకింగ్, రద్దు చేసి అక్రమంగా అమ్మే ప్రయత్నాలను నిరోధించేందుకు తీసుకున్న చర్య. ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు వర్చువల్ క్యూ బుకింగ్ అవసరం లేదు. భక్తులు అసలు ఆధార్ కార్డు లేదా జిరాక్స్‌తో పాటు బుకింగ్ పాస్‌ను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. అధికారిక వెబ్‌సైట్ తప్ప మరే ఇతర సైట్‌లోనూ బుక్ చేసుకోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఈ ఆన్‌లైన్ వ్యవస్థ వల్ల భక్తుల రద్దీ నియంత్రణలో ఉంది. ప్రయాణం, పంబా చేరుకోవడం, దర్శనం అన్నీ సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేశారు. గురుస్వాములు, భక్త సంఘాలు భక్తులను ముందుగానే ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలని ప్రోత్సహిస్తున్నాయి. దీంతో శబరిమల యాత్ర సురక్షితంగా, సౌకర్యవంతంగా మారిందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. ఆన్‌లైన్ బుకింగ్ ఉపయోగించుకుని భక్తి పూర్వకంగా స్వామి వారి దర్శనం పొందాలని భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు. స్వామియే శరణం అయ్యప్ప!

Next Story