Sri Kodandarama Temple: శ్రీ కోదండరామాలయంలో శాస్త్రోక్తంగా సహస్ర కలశాభిషేకం
సహస్ర కలశాభిషేకం

Sri Kodandarama Temple: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో అమావాస్య, పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని మంగళవారం శాస్త్రోక్తంగా సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. ఉదయం 8.30 గంటలకు ప్రారంభమైన ఈ సేవలో వేదమంత్రోచ్ఛారణల నడుమ అర్చకులు వైఖానస ఆగమ విధానంలో స్వామివారికి అభిషేకం నిర్వహించగా, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని దివ్యానుభూతిని పొందారు.
ఈ సందర్భంగా ఆలయంలో రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు హనుమంత వాహనసేవ వైభవంగా జరగనుంది. సర్వాలంకార భూషితులైన శ్రీ కోదండరామస్వామివారు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన హనుమంత వాహనాన్ని అధిష్ఠించి ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనం ప్రసాదించనున్నారు.
వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం పౌర్ణమి, అమావాస్య, శుక్ల ఏకాదశి, కృష్ణ ఏకాదశి, శ్రవణం, పునర్వసు నక్షత్ర దినాలు వైష్ణవ ఆలయాల్లో అత్యంత విశిష్టమైనవిగా భావిస్తారు.
వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం
పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రతినెలా నిర్వహించే శ్రీ సీతారాముల కల్యాణోత్సవం మంగళవారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఉదయం 11 గంటలకు కల్యాణ మండపంలో ప్రారంభమైన ఈ మహోత్సవాన్ని అర్చకులు వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు.
కల్యాణోత్సవంలో పాల్గొన్న గృహస్త దంపతులకు ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదాన్ని బహుమానంగా అందజేశారు.

