Brahmotsavams: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తుల పట్ల గౌరవం, మర్యాద, ఆప్యాయతతో మెలుగుతూ సేవలు అందించాలని టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు శ్రీవారి సేవకులను కోరారు.

తిరుమల ఆస్థాన మండపంలో బుధవారం టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి వివిధ రాష్ట్రాల నుంచి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు సేవలందించేందుకు విచ్చేసిన శ్రీవారి సేవకులతో చైర్మన్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీవారి సేవను మరింత బలోపేతం చేసి, సేవకుల సంఖ్యను రెట్టింపు చేసేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. భక్తులకు సౌకర్యవంతమైన, ఆప్యాయమైన సేవలు అందించడంలో శ్రీవారి సేవకుల పాత్ర ఎంతో కీలకమని చెప్పారు.

5,000 ఆలయాలకు శ్రీవారి సేవకులు మూలస్తంభాలుగా నిలవాలి

టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర మాట్లాడుతూ 5,000 ఆలయాల నిర్మాణానికి సంకల్పించామని, ఈ ఆలయాలకు శ్రీవారి సేవకులు మూలస్తంభాలుగా నిలవాలని కోరారు. నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర, దేశ స్థాయిలో ప్రణాళికాబద్ధంగా హిందూ ధర్మ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

శ్రీవారి సేవను మరింత బలోపేతం చేస్తాం

అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి మాట్లాడుతూ ప్రపంచంలోని ఏ ధార్మిక వ్యవస్థలోనూ ఇంత భారీ స్థాయిలో సేవకుల భాగస్వామ్యం లేదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించడం టీటీడీ ప్రధాన సిద్ధాంతమని తెలిపారు.

ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆలోచనతో శ్రీవారి సేవ రూపుదిద్దుకుందని, సేవకులకు శిక్షణ అందించి శ్రీవారి సేవను మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని చెప్పారు.

భక్తుల సేవే శ్రీవారి సేవ

బ్రహ్మోత్సవాల్లో సేవలందించేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సేవకులు అంకితభావంతో, క్రమశిక్షణతో, సమన్వయంతో విధులు నిర్వహించి భక్తులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వాములై, స్వామివారి వైభవాన్ని దశదిశలా వ్యాప్తి చేయాలని పిలుపునిచ్చారు.

Next Story