Close or Keep Your Eyes Open While Chanting Mantras: సనాతన ధర్మంలో మంత్ర జపానికి విశిష్టమైన స్థానం ఉంది. మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఇష్టదైవంతో ఆధ్యాత్మిక అనుసంధానం కోసం కోట్లాది మంది ప్రతిరోజూ మంత్రాలను పఠిస్తుంటారు. అయితే మంత్ర జపం చేసే సమయంలో కళ్లు మూసుకోవాలా లేక తెరిచి ఉంచాలా అనే సందేహం చాలామందిలో తలెత్తుతుంటుంది. అసలు శాస్త్రం ఏం చెబుతోంది? నిపుణుల ఆధ్యాత్మిక విశ్లేషణ ఏమిటి?

కళ్లు మూసుకుని జపించడం వల్ల కలిగే ప్రయోజనాలు

ధ్యానం, జప సాధనలో కళ్లు మూసుకోవడం అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రభావవంతమైన మార్గం. కళ్లు తెరిచి ఉన్నప్పుడు చుట్టూ ఉండే వస్తువులు, దృశ్యాలు మనసును పక్కదారి పట్టించే ప్రమాదం ఉంటుంది. కళ్లు మూసుకోవడం వల్ల బాహ్య ఆకర్షణలు ఆగిపోతాయి.

లోతైన ఏకాగ్రత:

ఉచ్ఛరించే మంత్ర నాదం, దాని అంతరార్థంపైనే మనస్సు సంపూర్ణంగా లగ్నమవుతుంది.

మానసిక ప్రశాంతత:

కళ్లు మూసుకుని హృదయంలో లేదా ఆజ్ఞాచక్రం వద్ద ఇష్టదైవ రూపాన్ని భావన చేస్తూ జపించడం వల్ల ఒత్తిడి తగ్గి, అంతశ్చేతన మేల్కొంటుంది.

కళ్లు తెరిచి మంత్ర జపం ఎప్పుడు చేయాలి?

కళ్లు తెరిచి జపించడం కూడా శాస్త్రసమ్మతమైన పద్ధతే.

సాకార ఉపాసన:

పూజా మందిరంలో కూర్చున్నప్పుడు, ఆలయాల్లో దైవ దర్శనం చేసుకుంటున్నప్పుడు, లేదా హోమ-హవనాలు నిర్వహించే వేళ దైవ విగ్రహం లేదా జ్యోతిని చూస్తూ జపం చేయడం ఉత్తమం.

ఆలసట, నిద్రమత్తు పోగొట్టేందుకు:

కళ్లు మూసుకోగానే కొందరికి నిద్రె ముంచుకొస్తుంది, మరికొందరికి లేనిపోని ఆలోచనలు సుడిగుండంలా చుట్టుముడతాయి. అటువంటి వారు కళ్లు తెరిచి, తమ ఇష్టదైవం ఫొటో లేదా విగ్రహాన్ని చూస్తూ జపం చేయడం వల్ల దృష్టి నిలకడగా ఉంటుంది.

జపంలో అసలైన ముఖ్యాంశం ఏది?

మంత్ర సాధనలో కళ్ల స్థితి కంటే మనస్సు స్థితి, నిశ్చలత్వం, నిష్కల్మషమైన భక్తి భావమే ప్రధానమైనవి. కళ్లు మూసుకుంటే ఏకాగ్రత కుదిరితే ఆ మార్గాన్ని, లేదు దైవ విగ్రహాన్ని చూస్తూ జపించడమే సౌకర్యంగా ఉంటే కళ్లు తెరిచే పద్ధతిని నిస్సంకోచంగా ఎంచుకోవచ్చు. ప్రశాంతమైన వాతావరణంలో క్రమం తప్పకుండా జపం చేయడం ద్వారా సంపూర్ణ మానసిక శాంతి, ఆధ్యాత్మిక శక్తి లభిస్తాయి.

Next Story