Profound Secret Revealed by Lord Krishna: కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధించిన 'భగవద్గీత' గురించి మనందరికీ తెలుసు. కానీ, శ్రీకృష్ణ భగవానుడు తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి వెళ్లే ముందు.. తన పరమ భక్తుడు, స్నేహితుడైన ఉద్ధవుడికి ఒక చివరి అద్భుత సందేశాన్ని ఇచ్చాడు. దానినే పురాణాల్లో 'ఉద్ధవ గీత' అంటారు. ఇందులో ఉద్ధవుడు అడిగిన కొన్ని కఠినమైన ప్రశ్నలకు కృష్ణుడు ఇచ్చిన సమాధానాలు, నేటి కలియుగ మానవుడికి ఎంతో అవసరం.

ఉద్ధవుడి ప్రశ్నలు

భగవానుడు వైకుంఠానికి వెళ్ళిపోతున్నాడని తెలిసి ఉద్ధవుడు ఎంతో దుఃఖిస్తాడు. అప్పుడు కృష్ణుడు "ఉద్ధవా! నువ్వు నన్ను ఎప్పుడూ ఏదీ కోరలేదు, నీకు ఏం కావాలో అడుగు" అంటాడు. అప్పుడు ఉద్ధవుడు.. "కృష్ణా! నువ్వు పాండవులకు ఆపద్బాంధవుడివి కదా! మరి ధర్మరాజు జూదమాడుతుంటే ఎందుకు ఆపలేదు? ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతుంటే.. ఆమె సభలో అందరి ముందు అవమానపడ్డాక గానీ నువ్వు ఎందుకు రాలేదు? ముందే వచ్చి ఆ కీడును ఎందుకు ఆపలేదు?" అని ప్రశ్నిస్తాడు.

శ్రీకృష్ణుడి సమాధానం - సృష్టి ధర్మం

ఉద్ధవుడి ప్రశ్నలకు కృష్ణుడు పరమార్థంతో కూడిన ఒక చిరునవ్వు నవ్వి ఇలా అంటాడు.. "ఉద్ధవా! ఈ సృష్టిలో ఒక నియమం ఉంది. ఎవరైతే వివేకంతో, అప్రమత్తంగా ఉంటారో వారికే విజయం దక్కుతుంది. దుర్యోధనుడికి జూదం రాకపోయినా, శకునిని తన తరఫున ఆడమన్నాడు. కానీ ధర్మరాజు మాత్రం తన వివేకాన్ని కోల్పోయాడు. కృష్ణుడు పక్కనే ఉన్నా.. నన్ను ఆటలోకి పిలవలేదు సరే కదా, తాను ఆడే జూదం నాకు తెలియకూడదని నన్ను ప్రార్థించాడు. నన్ను లోపలికి రాకుండా బంధించాడు" అని చెప్తాడు.

కర్మల సాక్షి భగవంతుడు :

కృష్ణుడు ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తాడు.. "నేను ఎవరి కర్మలలోనూ నేరుగా ప్రమేయం చేసుకోను, కేవలం సాక్షిగా మాత్రమే ఉంటాను. ఎప్పుడైతే మనుషులు తాము చేసే పనులను భగవంతుడు గమనిస్తున్నాడనే సత్యాన్ని మర్చిపోతారో, అప్పుడే తప్పులు చేస్తారు. ద్రౌపది కూడా మొదట తన భర్తలను, తన సొంత శక్తిని నమ్మింది. కానీ ఎప్పుడైతే అవేవీ లాభం లేదని, సర్వస్వం నాదే అని శరణు కోరిందో.. మరుక్షణమే నేను స్తంభంలోంచైనా వచ్చి రక్షించాను" అని వివరిస్తాడు.

Next Story