Significance of Tholi Ekadashi: తొలి ఏకాదశి ప్రత్యేకత.. తప్పక తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలు!
ఆసక్తికర విషయాలు!

Significance of Tholi Ekadashi: హిందూ సంప్రదాయంలో పండుగల కాలానికి నాంది పలికే అత్యంత పవిత్రమైన పర్వదినం.. తొలి ఏకాదశి! ఆషాఢ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఈ ఏకాదశినే దేవశయని ఏకాదశి లేదా పద్మ ఏకాదశి అని కూడా పిలుస్తారు.
పురాణాల ప్రకారం, ఈ రోజు నుంచే శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై నాలుగు నెలల పాటు యోగనిద్రలోకి జారుకుంటాడు. ఈ నాలుగు నెలల కాలాన్ని 'చాతుర్మాసం' అంటారు. స్వామివారు నిద్రించే సమయం కాబట్టి, ఈ సమయంలో వివాహాలు, గృహప్రవేశాల వంటి శుభకార్యాలకు విరామం ఇచ్చి, కేవలం భగవత్‌చింతన, జపతపాలకు ప్రాధాన్యత ఇస్తారు.
ఈ పర్వదినానికి సంబంధించి పురాణాలలో ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. పూర్వం మురాసురుడనే రాక్షసుడు దేవుళ్లను తీవ్రంగా వేధిస్తున్నప్పుడు, విష్ణుమూర్తి అతనితో సుదీర్ఘంగా యుద్ధం చేసి అలసిపోయి ఒక గుహలో యోగనిద్రలోకి వెళ్తాడు. స్వామిని సంహరించడానికి మురాసురుడు ప్రయత్నించగా, విష్ణువు శరీరం నుండి ఒక దివ్య కన్య ఉద్భవించి ఆ రాక్షసుడిని అంతం చేస్తుంది. ఆ కన్యకే విష్ణువు 'ఏకాదశి' అని నామకరణం చేసి, ఈ రోజున ఉపవాసం ఉన్నవారికి మోక్షం లభిస్తుందని వరమిచ్చాడు.
ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగానూ తొలి ఏకాదశికి ఎంతో ప్రాధాన్యత ఉంది. వర్షాకాలం ప్రారంభంలో శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అందుకే ఈ రోజున 'లoఖణం పరమౌషధం' అంటూ ఉపవాస దీక్ష పాటిస్తారు. అంతేకాదు, జొన్న పేలాలు, బెల్లం, యాలకులు కలిపి తయారుచేసిన పేలపిండిని నైవేద్యంగా సమర్పించి స్వీకరిస్తారు. ఇది శరీరంలో వేడిని తగ్గించి, ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం పదకొండింటినీ కంట్రోల్ చేస్తూ ఇంద్రియ నిగ్రహాన్ని సాధించడమే ఈ ఏకాదశి అంతరార్థం.

