Six Gurus for Mental Peace: మనశ్శాంతికి ఆరుగురు గురువులు: ముని బోధ్యుడు నహుషుడికి చెప్పిన జీవన పాఠం
జీవన పాఠం

Six Gurus for Mental Peace: పురూరవుడి మనుమడు నహుషుడు చక్రవర్తిగా ఉన్నప్పుడు బోధ్యుడు అనే మహర్షి అతని ఆస్థానానికి వచ్చాడు. మునికి ఆతిథ్యం ఇచ్చిన నహుషుడు “మహానుభావా! మనుషులు శాంతిని ఎలా పొందగలరు?” అని అడిగాడు. ముని ఇలా జవాబిచ్చాడు: “నేను ఎవరికీ ఉపదేశం ఇవ్వలేను. కానీ నాకు ఆరుగురు గురువులు ఉన్నారు. వారి నుంచి నేర్చుకున్నది మీకు చెబుతాను.
”మొదటి గురువు – వైరాగ్యం పొందిన ఓ స్త్రీ. వేశ్యావృత్తిని వదిలి దైవంపై మనసు లగ్నం చేసింది. ఆమె నుంచి “సంపదలు, వయసు వాంఛలు, యవ్వన గర్వం అన్నీ మాయ” అని తెలుసుకుని వాటిపట్ల వైరాగ్యం అలవర్చుకున్నాను.
రెండవ గురువు – ఓ పక్షి. నోట్లో మాంసపు ముక్కతో ఎగురుతుండగా ఇతర పక్షులు దాన్ని పొడిచాయి. ముక్కను వదిలేసిన తర్వాత అన్నీ వెళ్లిపోయాయి. “స్వార్థంతో పట్టుకోవడం కన్నా వదిలేయడమే శాంతిని ఇస్తుంది” అని నేర్చుకున్నాను.
మూడవ గురువు – పాము. చీమల పుట్టలో ప్రవేశించి అవి కష్టపడి కట్టినది దోచుకుంటుంది. “ఒకరి కష్టాన్ని స్వార్థంతో దోచుకోకూడదు” అని అర్థమైంది.
నాలుగవ గురువు – తుమ్మెద. రోజు కావాల్సిన తేనెను ఆ రోజే సంపాదించుకుంటుంది. మనుషులు మాత్రం తరతరాలకు సరిపడా కూడబెట్టి శాంతి కోల్పోతున్నారు. అందుకే తుమ్మెద గురువైంది.
ఐదవ గురువు – బాణాలు తయారు చేసే వ్యక్తి. తన పనిపై పూర్తి దృష్టి పెడతాడు. రాజు పక్కనుంచి వెళ్లినా పట్టించుకోడు. “ఎంచుకున్న పనిని నిర్వికారంగా చేయాలి” అని నేర్చుకున్నాను.
ఆరవ గురువు – ధాన్యం దంచుతున్న యువతి. చేతి గాజుల శబ్దం నిద్రపోతున్నవారికి ఆటంకం కాకుండా ఒక్కో గాజు మాత్రమే ఉంచుకుంది. “పదిమంది కలిసే చోట కలహం తప్పదు. ఏకాంతంగా ఉంటే ఆనందం” అని తెలిసింది.
ఈ ఆరుగురు గురువుల నుంచి నేర్చుకున్న విషయాలను ఆచరణలో పెట్టడం వల్లే మనశ్శాంతి లభిస్తుంది. కేవలం తెలుసుకోవడం సరిపోదు. సంపాదన అవసరమే కానీ దానికోసం ఇతరులను మోసం చేయడం, నైతిక విలువలను వదులుకోవడం సరికాదు. చూసే మనసు ఉంటే ప్రకృతే పరమ గురువై మనశ్శాంతి మార్గాలను చూపిస్తుంది. ఆ శాంతిని ఇతరులకు అందించగలిగితే వారి జీవితం కూడా ధన్యమవుతుంది.

