ఇక పాదరక్షలు పోయే ఛాన్స్ లేదు..

Smart Services at Tirumala: కలియుగ వైకుంఠం తిరుమలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక అడుగు వేసింది. స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులు ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో ఒకటి పాదరక్షల భద్రత. ఎక్కడ పడితే అక్కడ చెప్పులు వదిలేయడం వల్ల అవి కనిపించకుండా పోవడం లేదా వర్షానికి తడిసి అపరిశుభ్రంగా మారడం వంటి ఇబ్బందులు భక్తులకు ఎదురవుతున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా టీటీడీ QR-ఆధారిత స్మార్ట్ ఫుట్‌వేర్ ట్రాకింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టింది.

ఈ స్మార్ట్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?

గతంలో పాదరక్షల కౌంటర్ల వద్ద ఉండే రద్దీ, వాటిని డిపాజిట్ చేయడానికి, తిరిగి తీసుకోవడానికి పట్టే సమయం వల్ల భక్తులు ఇబ్బంది పడేవారు. అయితే ఈ కొత్త టెక్నాలజీతో ఆ ఇబ్బందులు తొలగిపోయాయి:

QR రసీదు

భక్తులు తమ పాదరక్షలను కౌంటర్‌లో అప్పగించిన వెంటనే, వారికి ఒక ప్రత్యేకమైన QR కోడ్ రసీదు ఇస్తారు.

దర్శనం ముగించుకుని తిరిగి వచ్చినప్పుడు ఆ QR కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా నిమిషాల వ్యవధిలోనే భక్తులు తమ పాదరక్షలను తిరిగి పొందవచ్చు. దీనివల్ల కౌంటర్ల వద్ద వేచి ఉండే సమయం గణనీయంగా తగ్గింది.

విస్తరిస్తున్న సేవలు.. త్వరలో మరిన్ని కౌంటర్లు..

ప్రస్తుతం ఈ సౌకర్యం ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లోనే అందుబాటులో ఉన్నప్పటికీ, భక్తుల నుంచి వస్తున్న సానుకూల స్పందనతో టీటీడీ ఈ సేవలను మరింత విస్తరిస్తోంది. కళ్యాణకట్ట, ఏటీసీ సర్కిల్, బేడి ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో కూడా త్వరలో ఈ స్మార్ట్ కౌంటర్లను ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టును కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సహకారంతో టీటీడీ అమలు చేస్తోంది.

8 లక్షల మందికి పైగా భక్తుల వినియోగం:

టీటీడీ అధికారిక లెక్కల ప్రకారం, ఇప్పటివరకు 8,45,816 మంది భక్తులు ఈ స్మార్ట్ వ్యవస్థను వినియోగించుకున్నారు. దీనివల్ల తిరుమల మాడ వీధుల్లో పరిశుభ్రత పెరగడమే కాకుండా చెప్పులు తప్పిపోయిన కేసులు కూడా భారీగా తగ్గాయి .అయితే సాంకేతికతపై పూర్తి అవగాహన లేని గ్రామీణ ప్రాంత భక్తులు ఇప్పటికీ పాత పద్ధతుల్లోనే రోడ్డు పక్కన పాదరక్షలను వదిలేస్తున్నారు. అలాంటి వారి కోసం టీటీడీ విస్తృతమైన ప్రచార కార్యక్రమాలను చేపట్టింది. భక్తులందరూ ఈ స్మార్ట్ సౌకర్యాన్ని వినియోగించుకుని తిరుమల పరిశుభ్రతలో భాగస్వాములు కావాలని కోరుతోంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story