Sri Padmavathi Ammavari Temple: తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంతో పాటు పరిసర ఉపాలయాల్లో జూన్ నెలలో వైభవంగా జరగనున్న విశేష ఉత్సవాల వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామి, అమ్మవార్ల కృపకు పాత్రులు కావచ్చు.

తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయం:

ఈ నెలలో ప్రతి శుక్రవారం (జూన్ 05, 12, 19, 26 తేదీలలో) సాయంత్రం 6 గంటలకు అమ్మవారికి వైభవంగా తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. అలాగే, జూన్ 4వ తేదీన ఉత్తరాషాడ నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం 6.45 గంటలకు అమ్మవారు గజవాహనంపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇక జూన్ 25వ తేదీ నుండి 29వ తేదీ వరకు అత్యంత వేడుకగా అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు జరగనున్నాయి.

ఉపాలయాల ఉత్సవాలు:

శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయంలో జూన్ 23న హస్త నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5 గంటలకు తిరుచ్చి ఉత్సవం జరుగుతుంది. శ్రీ సుందరరాజ స్వామి ఆలయంలో జూన్ 09న రాత్రి 7 గంటలకు స్వామివారు తిరుచ్చిపై ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. శ్రీ బాలకృష్ణ స్వామి ఆలయంలో జూన్ 14న రోహిణి నక్షత్రం సందర్భంగా రాత్రి 7 గంటలకు శ్రీ కృష్ణ స్వామివారికి తిరుచ్చి ఉత్సవం నిర్వహిస్తారు. అలాగే శ్రీ శ్రీనివాస ఆలయంలో జూన్ 06, 13, 20, 27 తేదీలలో వచ్చే శనివారాల్లో ఉదయం 8 గంటలకు ప్రత్యేక అభిషేకం జరుగుతుంది.

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయం:

ఈ ఆలయంలో జూన్ 25 నుండి జూలై 03వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా జూన్ 23న ఉదయం 8 నుంచి 10.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, జూన్ 24న సాయంత్రం 6.30 గంటలకు అంకురార్పణ నిర్వహిస్తారు. జూన్ 25న ఉదయం 8.30 గంటలకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి, అదే రోజు సాయంత్రం స్వామివారు పెద్దశేష వాహనంపై దర్శనమిస్తారు.

ఇతర విశేష సేవల విషయానికి వస్తే... జూన్ 05, 12, 19 తేదీలలో వచ్చే శుక్రవారాల్లో ఉదయం 7 గంటలకు వస్త్రలంకారణ సేవ, అభిషేకం ఉంటాయి. జూన్ 02న ఉదయం 8 గంటలకు అష్టదళ పాదపద్మారాధన, జూన్ 05న ఉదయం 10.30 గంటలకు కల్యాణోత్సవం, జూన్ 10న అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహిస్తారు. అలాగే జూన్ 07, 14, 21, 28 తేదీలలో వచ్చే ఆదివారాల్లో శ్రీ ఆంజనేయ స్వామి వారి మూలవర్లకు ఉదయం 8.15 గంటలకు ప్రత్యేక అభిషేకం జరగనుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story