Sri Govindaraja Swamy Brahmotsavams: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధల నడుమ నిర్వహించాలని టిటిడి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శుక్రవారం సాయంత్రం ఆలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ మే 23న ధ్వజారోహణంతో ప్రారంభమై, మే 31న ధ్వజావరోహణంతో ముగియనున్న బ్రహ్మోత్సవాలకు రాజీలేని విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. భక్తులకు వాహనసేవలతో పాటు మూలమూర్తి దర్శనం సైతం సాఫీగా కల్పించేలా సమన్వయంతో చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక పుష్పాలంకరణలు, ఇంజినీరింగ్ విభాగం ద్వారా క్యూలైన్లు, చలువపందిళ్లు, కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్ విభాగం ఆధ్వర్యంలో ఆలయం పరిసరాలను దేదీప్యమానంగా విద్యుద్దీపాలతో అలంకరించడంతో పాటు ఆర్చీలు, కటౌట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

బ్రహ్మోత్సవాలలో అవసరమైనంత మంది శ్రీవారి సేవకులను అందుబాటులో ఉంచాలని తెలిపారు. హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాలల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు, వాహనసేవల ముందు భజనలు, కోలాటాలు నిర్వహించి భక్తులను ఆధ్యాత్మిక వాతావరణంలో ముంచెత్తాలని సూచించారు.

అదనపు పారిశుద్ధ్య సిబ్బందిని నియమించాలని ఆరోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు, ఫైర్ ఇంజిన్లు, అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా టిటిడి విజిలెన్స్, పోలీస్ శాఖలతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story