Sri Govindaraja Swamy Temple Annual Brahmotsavall: తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన మంగళవారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామివారు కల్పవృక్ష వాహనంపై భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఉదయం 7 గంటల నుండి వైభవంగా సాగిన వాహనసేవలో గజరాజులు ముందుండగా, మంగళవాయిద్యాలు, కోలాటాలు, గోవింద నామస్మరణల నడుమ మాడవీధులు ఆధ్యాత్మిక కాంతులతో కళకళలాడాయి. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారి అనుగ్రహం పొందారు.

ప్రకృతికి ప్రాణాధారమైన వృక్షాలలో కల్పవృక్షం అత్యున్నతమైనదిగా పురాణాలు వర్ణిస్తాయి. సముద్ర మథనంలో ఆవిర్భవించిన ఈ దేవతా వృక్షం భక్తుల వాంఛిత ఫలాలను ప్రసాదించేదిగా ప్రసిద్ధి చెందింది. అలాంటి కల్పవృక్షాన్ని అధిరోహించిన కోనేటిరాయుడు భక్తుల కోరికలను తీర్చే దేవదేవుడిగా దర్శనమిచ్చి భక్తజనులను పరవశింపజేశారు.

స్నపన తిరుమంజనంలో భక్తి పరవశం

ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంధ ద్రవ్యాలు, పండ్ల రసాలతో అభిషేకం చేసి వేదమంత్రోచ్చారణల నడుమ విశేష పూజలు నిర్వహించారు.

సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ నిర్వహించనున్నారు.

సర్వభూపాల వాహనంపై రాత్రి దివ్య దర్శనం

ధర్మపాలనకు దివ్య సందేశమిచ్చే గోవిందుడు

రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామివారు సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. “రాజా ప్రజారంజనాత్‌” అన్న సూక్తికి అనుగుణంగా ప్రజలను రక్షించి ధర్మాన్ని స్థాపించేవారే నిజమైన పాలకులని ఈ వాహనసేవ ద్వారా స్వామివారు సందేశమిస్తారు. కలియుగంలో దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సర్వలోకాల అధిపతిగా సర్వభూపాల వాహనాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తారని ఆగమశాస్త్రాలు పేర్కొంటాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story