Sri Kalyana Srinivasa Swamy : నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 7 గంటలకు శ్రీవారు అశ్వవాహనాన్ని అధిరోహించి భక్తులకు నయనానందకరంగా దర్శనమిచ్చారు. దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం లోకపాలకుడు ధరించబోయే భవిష్యత్తు అవతారమైన ‘కల్కి’ రూపంలో స్వామివారు అలంకృతులై వీధుల్లో విహరించారు.

స్వామివారి వాహనసేవ ఆలయ వీధుల్లో అత్యంత కోలాహలంగా సాగింది. వాహనానికి ముందు భక్తజన బృందాలు చేసిన కోలాటాలు, భజనలు, మంగళవాయిద్యాల నడుమ ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడింది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పిస్తూ, గోవింద నామస్మరణతో పరవశించిపోయారు.

ఉపనిషత్తులు మరియు వేదాల ప్రకారం అశ్వవాహన సేవకు ఎంతో ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. ఉపనిషత్తులు మానవ ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తాయి. అందువల్ల, అశ్వాన్ని అధిరోహించిన ఆ పరమాత్ముడు.. మానవుని ఇంద్రియాలను అదుపులో ఉంచే 'ఇంద్రియ నియామకుడు' అని ఈ సేవ ద్వారా స్పష్టమవుతోంది. పరమాత్మను అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం కూడా కొనియాడింది. ఈ కలియుగంలో కలిదోషాలకు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని.. భగవంతుని నామ సంకీర్తనలను ఆశ్రయించి మోక్షాన్ని పొందాలని స్వామివారు కల్కి స్వరూపంలో భక్తులకు ప్రబోధిస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story