కోదండ రాముడు

Sri Kalyana Venkateswara Swamy Brahmotsavam: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శుక్ర‌వారం ఉదయం శ్రీనివాసుడు శ్రీ కోదండ రాముడి అలంకారంలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

ఉదయం 8 నుండి 9 గంటల వరకు స్వామివారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనసేవ ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

బ్రహ్మోత్సవాలలో ఆరో రోజు ఉదయం స్వామివారు కోదండ వేంకటరాముడై హనుమంతునిపై ఆసీనుడై భక్తులను అనుగ్రహించారు. శ్రీవారు త్రేతాయుగంలో శ్రీరాముడై అవతరించాడు. ఈ ఉత్సవంలో వాహనంగా హనుమంతుడిని, వాహనాన్ని అధిష్టించిన కల్యాణ వేంకటరాముడిని దర్శించడం వల్ల భోగమోక్షాలు, జ్ఞానవిజ్ఞానాలు, అభయారోగ్యాలు కలుగుతాయి.

కాగా మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు శ్రీవారి కల్యాణమండపంలో వసంతోత్సవం ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు. అనంత‌రం సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు స్వర్ణ రథోత్స‌వ‌ము వైభ‌వంగా జ‌రుగ‌నుంది. రాత్రి 8 నుండి 9 గంటల వరకు గజవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్‌, సూపరింటెండెంట్ శ్రీ ర‌మేష్‌, కంకణభట్టర్‌ శ్రీ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ మునికుమార్‌, శ్రీ ధ‌న శేఖ‌ర్‌, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story