Sri Kalyana Venkateswara Swamy Brahmotsavam: శ్రీనివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ఏడో రోజైన శ‌నివారం ఉదయం 8 గంట‌ల‌కు ఆదిత్య మండలం సూర్యప్రభ వాహనంపై ఖడ్గం, గద, విల్లు ధరించి శ్రీ సూర్య‌రాయణ‌స్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వాహనసేవ ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

సూర్యుడు సకల రోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నాడు. ఈ వాహ‌నంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్య ప్రభ. సూర్య మండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యుని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. ఇంతటి మహాతేజఃపూర్ణమైన సూర్యప్రభ వాహనంలో ఉండే సూర్యనారాయణుడిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. వాహ‌న సేవ‌లో ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్‌, సూపరింటెండెంట్ శ్రీ రాజ్‌కుమార్‌, ఆల‌య అర్చ‌కులు శ్రీ బాలాజీ రంగాచార్యులు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ మునికుమార్‌, శ్రీ ధ‌న శేఖ‌ర్‌, ఇత‌ర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో 8వ‌ రోజైన ఆదివారం రథోత్సవం వైభవంగా జరుగనుంది. ఉదయం 6.30 గంటలకు స్వామివారు రథారోహణం చేస్తారు. ఉదయం 7.45 గంటలకు రథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు అశ్వవాహనంపై స్వామివారు విహరించి భక్తులను కటాక్షించనున్నారు.

Next Story