Sri Kalyana Venkateswara Swamy: గరుడ వాహనంపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు
శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు

Sri Kalyana Venkateswara Swamy: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవాలలో భాగంగా జూలై 02వ తేదీ గరుడ వాహనంపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి విహరించి భక్తులను అనుగ్రహించారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 11 నుండి 12 గంటల వరకు ఆలయ ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు ఊంజల్ సేవ చేపట్టారు. సాయంత్రం 06 గం.లకు ఉత్సవ మూర్తులను వాహన మండపంలోకి వేంచేపు చేశారు. సాయంత్రం 6.30 గం.లకు లక్ష్మీ హారాన్ని ఆలయ ప్రదక్షిణగా అలంకార మండపంలోకి తీసుకువచ్చి స్వామి వారిని అలంకరించారు. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. మరోవైపు జూలై 03వ తేదీన గురువారం ఉదయం 07 – 11 గం.ల వరకు ఉత్సవ మూర్తులు పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. ఉదయం 11.00 – 02.00 గం.ల మధ్య పార్వేట ఉత్సవం జరుగనుంది. ఈ సందర్భంగా ఆస్థానం, వైదిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
