Sri Krishna Janmashtami: శ్రీ కృష్ణ జన్మాష్టమి.. పూజా విధానం, అర్ధరాత్రి వేడుకల ప్రత్యేక విశేషాలు!
ప్రత్యేక విశేషాలు!

Sri Krishna Janmashtami: ప్రతి సంవత్సరం భాద్రపద మాస కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్ర పర్వదినం శ్రీ కృష్ణ జన్మాష్టమి. లోకంలో ధర్మ స్థాపన కోసం శ్రీమహావిష్ణువు పరిపూర్ణావతారమైన శ్రీకృష్ణుడు అర్ధరాత్రి వేళ ఆవిర్భవించిన ఈ రోజుకు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఈ నెల అంటే సెప్టెంబర్ 4వ తేదీ శుక్రవారం రోజున భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ వేడుకను జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు.
భాగవత పురాణం ప్రకారం మధురను ఏలే క్రూర పాలకుడు కంసునికి చెల్లెలు దేవకి వివాహ సమయంలో.. ఆమె గర్భాన పుట్టే ఎనిమిదవ సంతానమే తన మరణానికి కారణమవుతుందని అశరీరవాణి హెచ్చరిస్తుంది. దీంతో భయపడిన కంసుడు దేవకీ వసుదేవులను చెరసాలలో బంధిస్తాడు. భాద్రపద మాస కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు, అర్ధరాత్రి భీకరమైన చీకటిలో శ్రీమహావిష్ణువు శ్రీకృష్ణుడిగా ఆవిర్భవిస్తాడు.
కంసుని బారి నుంచి ఆ పసిపాపను రక్షించేందుకు వసుదేవుడు అర్ధరాత్రి పూట యమునా నదిని దాటి, గోకులంలోని నందగోప యశోదల వద్దకు కృష్ణుడిని సురక్షితంగా చేర్చుతాడు. శ్రీకృష్ణుడు అర్ధరాత్రి చీకటిలో జన్మించినందునే ప్రతి ఏటా భక్తులు నిశీత పూజలు చేసి, అర్ధరాత్రి వేళ స్వాగతం పలుకుతారు.
పూజా విధానం (Puja Vidhanam):
ఉపవాస దీక్ష: జన్మాష్టమి రోజున భక్తులు రోజంతా ఉపవాస దీక్ష ఆచరిస్తారు. కేవలం పండ్లు, పాలు స్వీకరించి స్వామిని స్మరిస్తారు.
గృహ శుద్ధి & వేదిక ఏర్పాటు: ఇల్లు , పూజా మందిరాన్ని శుభ్రం చేసి, మామిడి తోరణాలతో అలంకరించాలి. పూజా పీఠంపై పసుపు, కుంకుమలు రాసి, ముగ్గులు వేయాలి.
బాలకృష్ణుని ప్రతిష్ట: పూజా మందిరంలో శ్రీకృష్ణుని విగ్రహాన్ని (బాలకృష్ణుడు) లేదా ఫోటోను ఒక చిన్న పీఠంపై ఉంచాలి. స్వామికి పట్టు వస్త్రాలు, పూలతో అలంకరణ చేయాలి. కృష్ణుడి పాదములను ఇంటి గుమ్మానికి బియ్యపు పిండితో ముద్రగా వేయడం సంప్రదాయం.
అభిషేకం & నైవేద్యం: అర్ధరాత్రి పూజా సమయంలో పాలు, పెరుగు, నెయ్యి, తేనె, గంగాజలంతో కూడిన పంచామృతాలతో బాలకృష్ణునికి అభిషేకం చేయాలి. శ్రీకృష్ణునికి అత్యంత ఇష్టమైన వెన్న, పటికబెల్లం, అటుకులు, రకరకాల పిండి వంటలను నైవేద్యంగా సమర్పించాలి.
హారతి & ప్రసాద వితరణ: భక్తితో కృష్ణాష్టకం, విష్ణు సహస్రనామం పఠిస్తూ ధూప దీప నైవేద్యాలు సమర్పించి హారతి ఇవ్వాలి. ఆ తర్వాత కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రసాదాన్ని స్వీకరించి ఉపవాసం విరమించాలి.

