Sri Soumyanatha Swamy: నందలూరులోని ప్రసిద్ధ శ్రీ సౌమ్యనాథస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక శోభతో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మూడో రోజైన శుక్రవారం రాత్రి శ్రీ సౌమ్యనాథస్వామివారు యోగ నరసింహ స్వరూపంలో అలంకరించబడి, సింహవాహనంపై అధిరోహించి భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాద్యాల నడుమ సాగిన ఈ వాహనసేవలో స్వామివారు అభయ హస్తంతో భక్తులను కటాక్షించారు.

​దుష్టశిక్షణ, శిష్టరక్షణలకు ప్రతీకగా స్వామివారు ఈ సింహవాహనాన్ని అధిరోహించారు. లోకంలో వ్యాపించిన అజ్ఞానాన్ని, అధర్మాన్ని పూర్తిగా నిర్మూలించి ధర్మాన్ని పరిరక్షించడంలో తాను, తన వాహనమైన సింహం కలసికట్టుగా కృషి చేస్తామనే దివ్య సందేశాన్ని ఈ వాహనసేవ ద్వారా స్వామివారు భక్తులకు అందజేశారు. భక్తజనం స్వామివారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుని తరించిపోయారు.

​బ్రహ్మోత్సవాల క్రమంలో శనివారం (జూలై 25) నాడు ఉదయం కల్పవృక్ష వాహనంపై, రాత్రి హనుమంత వాహనంపై శ్రీ సౌమ్యనాథస్వామివారు ఊరేగుతూ భక్తులకు అభయమివ్వనున్నారు. ఈ విశేష కార్యక్రమాల్లో టీటీడీ జేఈవో డాక్టర్ ఏ. శరత్, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి ఎ. ప్రశాంతి, ఈఈ శ్రీమతి సుమతి, ఏఈవో శ్రీ రవి, సూపరింటెండెంట్ శ్రీ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ దిలీప్, ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు, శ్రీవారి సేవకులు మరియు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story