Sri Vari Brahmotsavams: శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో ఆరంభం
అంకురార్పణతో ఆరంభం

Sri Vari Brahmotsavams: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య అంకురార్పణ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ వేడుకలో భాగంగా ఆలయానికి నైరుతి దిశలో ఉన్న పుట్ట మట్టిని సేకరించి, అందులో నవధాన్యాలను నాటుతారు. బుధవారం సాయంత్రం 5.43 నుంచి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం జరుగుతుంది. ఈ ఉత్సవాలపై ఉపగ్రహ నిఘా ఉంటుందని ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లోభక్తులకు 16 రకాల వంటకాలు పంపిణీ చేయనున్నారు. వాహన సేవలు తిలకించేందుకు 36 LED స్క్రీన్‌లు అమర్చారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పిస్తూ ప్రివిలేజ్ దర్శనాలను రద్దు చేశారు. బ్రహ్మోత్సవాలకు 60 టన్నుల పుష్పాలు వినియోగిస్తున్నారు. రోజూ 8లక్ష్ల లడ్డూలు అందుబాటులో ఉంటాయి. 229 కళాబృందాల ప్రదర్శనలు ఉంటాయి. భద్రత కోసం 3K సీసీ కెమెరాలు, 7K పైగా సిబ్బందిని నియమించారు.
బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ధ్వజస్తంభంపైకి గరుడ పతాకం ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. రుత్వికులు వేద మంత్రాలతో దర్భ చాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు. దర్భతో పేనిన తాడును ధ్వజస్తంభంపై వరకు చుడతారు. వీటి తయారీ కోసం టిటిడి అటవీ శాఖ 10 రోజుల ముందునుంచే కసరత్తు చేస్తుంది. దర్భలో శివ దర్భ, విష్ణు దర్భ అనే రెండు రకాలు ఉండగా, తిరుమలలో విష్ణు దర్భను ఉపయోగిస్తారు.
