Sri Vari Laddu Prasadam: రికార్డుస్థాయిలో లడ్డూ ప్రసాదాల విక్రయం
లడ్డూ ప్రసాదాల విక్రయం

Sri Vari Laddu Prasadam: 2025 సంవత్సరంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాలు రికార్డుస్థాయిలో విక్రయించబడ్డాయి. 2024వ సంవత్సరంతో పోల్చితే 10 శాతం అధికంగా లడ్డూలను భక్తులకు విక్రయించడం జరిగింది. గత ఏడాది 12.15 కోట్ల లడ్డూలను విక్రయించగా ఈ ఏడాది 13.52 కోట్ల లడ్డూలను టీటీడీ భక్తులకు విక్రయించింది. అంటే గత ఏడాదితో పోల్చితే 1.37 కోట్ల లడ్డూలను ఈ ఏడాది అదనంగా భక్తులకు విక్రయించడం జరిగింది. గత దశాబ్దకాలంలో ఎన్నడూ లేనివిధంగా 2025 డిసెంబర్ 27వ తేదిన అత్యధికంగా 5.13 లక్షల లడ్డూలను భక్తులు కొనుగోలు చేశారు. గత పదేళ్లలో ఇదే అత్యధిక విక్రయం. టీటీడీ గత సంవత్సరం గా ప్రతిరోజూ 4 లక్షల వరకూ లడ్డూలను తయారు చేస్తోంది. ముఖ్యమైన రోజుల్లో 8 లక్షల నుండి 10 లక్షల లడ్డూల వరకు(buffer)భక్తలకు అందుబాటులో ఉంచుతోంది. 700 మంది శ్రీవైష్ణవ బ్రహ్మణులు శ్రీవారి పోటులో రెండు షిప్టుల్లో 24 గంటలు శ్రమిస్తూ నియమ, నిష్టలతో స్వామివారి లడ్డూ ప్రసాదాలను తయారు చేస్తారు. ఇటీవల కాలంలో లడ్డూల నాణ్యత, రుచి పెరగడంపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపైపు 2025లో తిరుమల శ్రీవారికి భారీగా ఆదాయం వచ్చింది. హుండీ ద్వారా రూ.1,383.90 కోట్లు లభించగా, ఇది 2024తో పోలిస్తే రూ.18 కోట్లు అధికం. 2.61 కోట్ల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

