Sarva Bhoopala Vahanam: సర్వభూపాల వాహనంపై గజేంద్ర మోక్ష అలంకారంలో శ్రీమలయప్ప అభయం
శ్రీమలయప్ప అభయం

Sarva Bhoopala Vahanam: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు శుక్రవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు సర్వభూపాల వాహనంపై గజేంద్ర మోక్ష అలంకారంలో భక్తులకు అభయమిచ్చారు.
మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా సాగిన ఈ వాహనసేవలో వివిధ రాష్ట్రాల కళాబృందాలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు గజేంద్ర మోక్ష అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీమలయప్పస్వామివారిని కనులారా దర్శించుకుని భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.
సర్వభూపాల వాహనం – యశోప్రాప్తికి ప్రతీక
సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. ఇందులో అష్టదిక్పాలకులు కూడా ఉంటారు. తూర్పున ఇంద్రుడు, ఆగ్నేయంలో అగ్ని, దక్షిణంలో యముడు, నైరుతిలో నిరృతి, పశ్చిమాన వరుణుడు, వాయువ్యంలో వాయువు, ఉత్తరాన కుబేరుడు, ఈశాన్యంలో పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతారు.
అష్టదిక్పాలకులంతా శ్రీమహావిష్ణువును తమ భుజస్కంధాలపై, హృదయంలో కొలువుంచి సేవిస్తారనే భావనకు సర్వభూపాల వాహనం ప్రతీకగా నిలుస్తుంది.
శ్రీమలయప్పస్వామివారి అనుగ్రహంతో రాజ్యపాలన సుభిక్షంగా సాగి, ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఈ వాహనసేవ చాటిచెబుతుంది.
ఈ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ శ్రీ బి.ఆర్. నాయుడు, ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, పలువురు బోర్డు సభ్యులు, అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీ కే.వి. మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

