కైలాస ప్రవేశానికి అనుమతి!

Srisailam Sakshi Ganapati Temple: నల్లమల అడవులలో కొండగుట్టలమధ్య గల ఈ శ్రీ మల్లికార్జునుని పవిత్ర క్షేత్రం ఎంతో ప్రసిద్ధి. ద్వాదశ జ్యోతిర్లింగాల లో ఇది ఒకటి. హరహర మహదేవ శంభో శంకరా అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతుంటుంది. శ్రీశైలానికే సిరిగిరి, శ్రీగిరి, శ్రీపర్వతం, శ్రీశైలం మొదలైన నామాతరాలున్నాయి. శ్రీ అనగా సంపద, శైలమంటే పర్వతం కనుక శ్రీశైలమంటే సంపద్వంతమైన పర్వతమని అర్థం. దీనికి శ్రీకైలాసం అనే పేరుతో వ్యవహారం వుండడమూ ఉంది. సా.శ.1313లోని ఒక శాశనాన్ని అనుసరించి దీనికి శ్రీ కైలాసము అనే పేరూ ఉన్నట్టు తెలుస్తోంది. దానిలో మహేశ్వరులు శ్రీకైలాసము (శ్రీశైలం) పైన నివసించారని ఉంది.

సాక్షి గణపతి

ఇక్కడ ఈ గణపతి ఆలయము ప్రత్యేకం. ఎందుకంటే మనము శ్రీశైలములో శివుడిని దర్శించినంత మాత్రముననే కైలాస ప్రవేశానికి అనుమతి లభిస్తుంది. అప్పుడు మనకు ఈ సాక్షి గణపతే సాక్ష్యము చెపుతాడు, మనము శ్రీశైలము వచ్చినాము అని. అందుకే ఈయనను సాక్షి గణపతి అంటారు.

పాతాళ గంగ

శ్రీశైలం ప్రక్కనే కృష్ణానది ప్రవహిస్తుంది. కాకపోతే శ్రీశైలము చాలా ఎత్తులో ఉన్నది, నది మాత్రము క్రింద లోయలో ప్రవహిస్తుంది. అందుకే శ్రీశైలము నుండి చాలా మెట్లు దిగి కృష్ణానదిలో స్నానం చెయ్యాలి. ఈ కృష్ణానదినే ఇక్కడ పాతాళగంగ అనే సార్థక నామధేయముతో వ్యవహరిస్తారు. ఆ మెట్లు అన్నీ దిగి కృష్ణలో మునిగి తిరిగి ఎక్కినపుడు పాతాళగంగ అనునది ఎంత సార్థక నామధేయమో తెలుస్తుంది. పాతాళ గంగ వద్ద నీరు నీలంగా కాక పచ్చగా ఉంటుంది నీటి క్రింద బండలపై నాచు నిలచి సూర్య కిరణాల వెలుగు వలన పచ్చగా కానవస్తుంది. అయితే అందరూ నీటి క్రిందగల దీనిని పచ్చల బండ అని వ్యవహరిస్తారు.

శ్రీశైల శిఖరం

శ్రీశైలం మొత్తంలో ప్రత్యేకమైనది, ఈ శ్రీశైల శిఖరం. శ్రీశైలములో శిఖరదర్శనము చేసుకొంటే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. శిఖరదర్శనము అంటే పక్కనే నిలబడి శిఖరాన్ని చూడటం కాదు; దూరంగా ఉన్న ఈ ఎత్తైనకొండ శిఖరేశ్వరం పై నుండి దూరంగా ఉన్న ఆలయ శిఖరాన్ని చూడాలి. అలా చూస్తే, శిఖరం కనిపిస్తే పునర్జన్మ నుండి విముక్తులవుతారని నమ్ముతారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story