Srivari Salakatla Brahmotsavam: సెప్టెంబర్ 15 నుండి 23వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

Srivari Salakatla Brahmotsavam: ఈ సంవత్సరం శ్రీవారి భక్తులకు రెట్టింపు ఆధ్యాత్మిక ఆనందం కలగనుంది. తిరుమలలో ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు 'సాలకట్ల బ్రహ్మోత్సవాలు', అలాగే అక్టోబర్ 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 'నవరాత్రి బ్రహ్మోత్సవాలు' జరగనున్నాయి. ఈ ప్రధాన వేడుకలకు సంబంధించి సెప్టెంబర్ 14వ తేదీ సాయంత్రం అంకురార్పణతో సాలకట్ల బ్రహ్మోత్సవాల ప్రక్రియ ప్రారంభమవుతుంది.
బ్రహ్మోత్సవాల సమయంలో ప్రతిరోజూ స్వామివారు వివిధ వాహనాలపై మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. సాధారణంగా ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, అలాగే సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఈ వాహన సేవలు కొనసాగుతాయి.
బ్రహ్మోత్సవ వాహన సేవల వివరాలు:
సెప్టెంబర్ 15: సాయంత్రం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి 9 గంటలకు శ్రీవారు పెద్ద శేష వాహనంపై దర్శనమిస్తారు.
సెప్టెంబర్ 16: ఉదయం చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం, రాత్రి హంస వాహన సేవ ఉంటుంది.
సెప్టెంబర్ 17: ఉదయం సింహ వాహనం, రాత్రి ముత్యపు పందిరి వాహనంపై స్వామివారు ఊరేగుతారు.
సెప్టెంబర్ 18: ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనం సేవలు నిర్వహిస్తారు.
సెప్టెంబర్ 19: ఉదయం జగన్మోహిని రూపంలో మోహినీ అవతారం, సాయంత్రం 6:30 నుంచి రాత్రి 11:30 గంటల వరకు అత్యంత కీలకమైన గరుడ వాహన సేవ వైభవంగా జరుగుతుంది.
సెప్టెంబర్ 20: ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథోత్సవం, రాత్రి గజ వాహన సేవలు ఉంటాయి.
సెప్టెంబర్ 21: ఉదయం సూర్యప్రభ వాహనం, మధ్యాహ్నం స్నపన తిరుమంజనం, రాత్రి చంద్రప్రభ వాహనంపై స్వామివారు అలరిస్తారు.
సెప్టెంబర్ 22: ఉదయం 7 గంటలకు వైభవంగా రథోత్సవం, రాత్రి అశ్వ వాహన సేవ సాగుతుంది.
సెప్టెంబర్ 23: ముగింపు రోజున ఉదయం 6 నుంచి 9 గంటల వరకు చక్రస్నానం జరుగుతుంది. ఆ రాత్రి ధ్వజావరోహణంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు మంగళప్రదంగా ముగుస్తాయి.

