Tirumala Tirupati : తిరుమలలో రీల్స్ చిత్రీకరిస్తే కఠిన చర్యలు
సోషల్ మీడియాలో రీల్స్ మేకర్స్‌కు టీటీడీ హెచ్చరిక

తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను దెబ్బతీసేలా ఆలయ ప్రాంగణంలో మరియు చుట్టుపక్కల సోషల్ మీడియా రీల్స్‌ను చిత్రీకరించడం వాటిని సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేయడం వంటి చర్యలకు పూనుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈమధ్య కాలంలో కొంత మంది వ్యక్తులు ఆలయం ముందు అభ్యంతరకరమైన వీడియోలను రికార్డ్ చేసి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పోస్ట్ చేయడం పట్ల టీటీడీ ఆందోణ వ్యక్తం చేసింది. ఆద్యాత్మిక ప్రాంతాల్లో దైవిక వాతావరణం చెడగొట్టే విధంగా ఇటువంటి ప్రవర్తనపై టీటీడీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. టీటీడీ సాంప్రదాయాలను మంటకలిపేలా ఇలా స్వామివారి సన్నిధిలో రీల్స్ చేయడాన్ని టీటీడీ అధికారులు ఖండించారు. ఇటువంటి చర్యలు తీరుమల పవిత్రతకు భంగం కలిగించడమే కాకుండా వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం వచ్చే లక్షలాది మంది భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరుస్తున్నాయని టీటీడీ పేర్కొంది. తిరుమల అనేది కేవలం ఆరాధన మరియు భక్తి కోసం ఉద్దేశించబడిన పవిత్రమై ఆధ్యాత్మిక ప్రాంతమని ప్రతి భక్తుడు దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను గౌరవించే విధంగా ప్రవర్తించాలని టీటీడీ హితవు పలికింది. ఆలయ మర్యాదలను ఉల్లంఘించే విధంగా ఎటువంటి కంటెంట్‌ను చిత్రీకరించడం గానీ ప్రసారం చేయడం ద్వారా ఎవరైనా దోషులుగా తేలితే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీటీడీ విజిలెన్స్ మరియు భద్రతా విభాగానికి టీటీడీ ఉన్నతాదికారులు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన వారు క్రిమినల్ కేసులతో పాటు చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని టీటీడీ హెచ్చరిక చేసింది. తిరుమల ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడటంలో భక్తులు అందరూ సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
